సీఎంపై చీటింగ్ కేసు పెట్టాలి

Update: 2021-12-06 09:27 GMT

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబునాయుడు మండిప‌డ్డారు. జ‌గ‌న‌న్న సంపూర్ణ గృహహ‌క్కు ప‌థ‌కం పేరుతో ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఎన్టీఆర్ హయాంలోనే పేదలకు పక్కా ఇళ్ల పధకం వచ్చిందని చంద్రబాబు తెలిపారు. 56 లక్షల 69 వేల మంది ఇళ్ల యజమానుల నుంచి రూ. 10 వేలు, రూ. 20 వేలు కట్టించుకునే పని మొదలు పెట్టారని, వ‌న్ టైమ్ సెటిల్ మెంట్ (ఓటీఎస్) కోసం ఒత్తిడి లేదు అనేది పచ్చి అబద్ధమన్నారు. ఓటీఎస్‌కు అంగీకరించకపోతే అన్ని పధకాలు నిలిపివేస్తామని అధికారులు అన్న ఫోన్ కాల్ వాయిస్‌లను చంద్రబాబు మీడియా ఎదుట ప్రదర్శించారు. ఇచ్చిన మాట తప్పిన సీఎంపై చీటింగ్ కేసు పెట్టాలని చంద్రబాబు అన్నారు.

అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి టీడీపీ అధినేత చంద్రబాబు పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో నేతలు అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య, స్థానిక నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా 125 అడుగుల విగ్రహం పెట్టాలని ఆనాడు నిర్ణయించామన్నారు. రాజధాని అమ‌రావ‌తిలో 20 ఎకరాల విస్తీర్ణంలో అంబేద్కర్ స్మారక నిర్మాణానికి ఉత్తర్వులు కూడా ఇచ్చామన్నారు. అలాంటి ప్రాజెక్టును జగన్ సర్కార్ పక్కన పెట్టేసిందని విమర్శించారు. రాజధానిలో అంబేద్కర్ స్మారక ప్రాజెక్టును ప్రభుత్వం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. దేశానికే ఆద‌ర్శ‌మైన నిర్ణ‌యాన్ని తాము తీసుకుంటే ఈ ప్ర‌భుత్వం దాన్ని విస్మ‌రించింద‌ని తెలిపారు. 

Tags:    

Similar News