ఇన్ స్టంట్ నిర్ణయాలు తప్ప ..వ్యూహాలు ఉండవా?!

Update: 2024-04-10 04:25 GMT

ఆంధ్ర ప్రదేశ్ లో పని చేస్తున్న వాలంటీర్లు తొంబై శాతం పైగా వైసీపీ వాళ్లే. ఈ విషయాన్ని ఆ పార్టీ కీలక నేత విజయ సాయి రెడ్డి తో పాటు చాలా మంది మంత్రులే అధికారికంగా చెప్పారు కూడా. వైసీపీ తో ఉన్న అనుబంధం విషయం తప్ప ..వాలంటీర్లు అందించే సేవలపై ప్రజల్లో కూడా సానుకూలత ఉంది. ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం తీసుకునే వాళ్ళు తటస్థం ఉండాలి కానీ..ఎక్కువ మంది వైసీపీ కోసం పనిచేస్తున్నారు అనే విమర్శలు ఉన్నాయి. వాళ్లే అధికారికంగా వాలంటీర్లు అంతా తమ వాళ్లే అని చెప్పుకున్నాక వాళ్ళ నుంచి అంతకు మించి ఎవరు భిన్నమైన పనితీరు ఆశించినా అత్యాశే అవుతుంది. ఆంధ్ర ప్రదేశ్ లోని వాలంటీర్లు కొంత మంది తీవ్ర వివాదాల్లో చిక్కుకున్నారు కూడా . ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో వలంటీర్ల అంశం ఒక ఎన్నికల అజెండాగా మారింది. ఇంతటి కీలకమైన విషయంలో ఒక విధానం అంటూ లేకుండా...ఎన్నికల ముందు వరకూ తీవ్ర విమర్శలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు సడన్ గా తాము అధికారంలోకి వస్తే వాళ్లకు పది వేల రూపాయల వేతనం అందిస్తామని ప్రకటించారు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు అధికారికంగా వాళ్లంతా తమ వాళ్లే అని చెప్పుకున్న వైసీపీ వాలంటీర్లకు పది వేల రూపాయల జీతం ఇవ్వటానికి సిద్దపడ్డారన్న మాట.

                                                     మరి అయన ఇంత సడన్ గా మాట మార్చుకోవటానికి కారణం ఏమిటి అంటే కచ్చితంగా ఎన్నికలే అని చెప్పొచ్చు. వాలంటీర్లను ఉద్యోగంలో నుంచి తొలగించబోమని చెప్పటంతో పాటు వాళ్ళ వేతనం ఇప్పటి కంటే రెట్టింపు చేస్తామని చెప్పటం విశేషం. .వాలంటీర్ల విషయంలో టీడీపీ అధినేత తీరును చూసిన పార్టీ నాయకులు కూడా చంద్రబాబు ‘కన్ఫ్యూజన్ స్టార్’ లా మారిపోయారు అని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉండి..తనకు తాను ఎంతో అనుభవం ఉన్న నేతగా ప్రచారం చేసుకుంటూ ఎన్నికల ముందు వరకూ వాలంటీర్లు అందించే సేవలు ఎంత మేర ప్రభావం చూపిస్తాయి...ఎన్నికల్లో ఈ అంశం ఎంత కీలకంగా ఉంటుంది అనే విషయంపై ఏ మాత్రం అవగాహన లేకుండా అప్పటికప్పుడు వాలంటీర్లకు పది వేల జీతం ఇస్తామని చెప్పటం పెద్ద సంచలనంగా మారింది అనే చెప్పాలి. మరో మాటలో చెప్పాలంటే వాళ్ళు అంతా తమ వాళ్లే అని వైసీపీ అధికారికంగా చెప్పిన తర్వాత కూడా చంద్రబాబు ఇప్పుడు వాళ్లకు రెట్టింపు జీతం ఇస్తానంటే చూసే వాళ్లకు ఎలా అనిపిస్తోందో అర్ధం కావటం లేదు అని ఒక టీడీపీ నాయకుడు వ్యాఖ్యానించారు.

                                                  ప్రతిపక్షం లో ఉండి కూడా అధికార పార్టీ వ్యూహాలు ఎలా ఉంటాయి...వాటిని ఎలా కౌంటర్ చేయాలి అనే ప్లానింగ్ లేకుండా అప్పటికప్పుడు ఖంగారు గా నిర్ణయాలు తీసుకుంటే వాటివల్ల వచ్చే ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది అనే చర్చ కూడా సాగుతోంది. చంద్రబాబు వాలంటీర్లను విమర్శించిన వాళ్ళ సేవలను కాకుండా...వాళ్ళ రాజకీయ అనుబంధాన్ని మాత్రమే తప్పు పట్టి ఉంటే ఇప్పుడు రాజకీయంగా ఇంత ఇబ్బందికార పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చేది కాదు అన్నది ఎక్కువ మంది నేతల అభిప్రాయం. ఎలా చెప్పినా..ఎందుకు చెప్పిన ఇది అధికార వైసీపీ ని ఉలికిపాటుకు గురి చేసింది అనే చెప్పాలి. అందుకే చంద్రబాబు మాటలను వాలంటీర్లు నమ్మరు అంటూ వైసీపీ కౌంటర్ ఎటాక్ స్టార్ట్ చేసింది. ఏ ప్రభుత్వ ఉద్యోగంలో కూడా వాలంటీర్ల ని నియమించినట్లు తమకు నచ్చిన వాళ్ళను నియమించుకునే ఛాన్స్ ఉండదు అనే విషయం తెలిసిందే. ఇది గౌరవ వేతనంతో కూడిన పని కావటంతో అధికార పార్టీ పూర్తిగా తమ వాళ్ళను పెట్టుకుని ఎన్నికల సమయంలో రాజకీయ వాతావరణాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో ఉంది.

Tags:    

Similar News