స్పీడ్ అఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఒకరి తర్వాత ఒకరు వరసగా విదేశాలకు వెళ్లటమా!. అది కూడా ముఖ్యమంత్రి ..ఇద్దరు మంత్రులతో కలిసి దుబాయ్ టూర్ కు వెళ్లి వచ్చిన తర్వాత మరో మంత్రి దుబాయ్ వెళ్లి మళ్ళీ అదే కంపెనీ ప్రతినిధులతో సమావేశం అవటంతో ఈ మొత్తం ప్రహసనంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత నెలలో మూడు రోజులు దుబాయ్ లో పర్యటించారు. అక్కడ శోభా గ్రూప్ చైర్మన్ రవి పీ ఎన్ సి మీనన్ తో సమావేశం అయి రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరించారు. అదే సమయంలో శోభా గ్రూప్ అమరావతి లో ప్రపంచ శ్రేణి లైబ్రరీ నిర్మాణానికి వంద కోట్ల రూపాయల విరాళం కూడా ఇవ్వనున్నట్లు కూడా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. శోభా గ్రూప్ ప్రతినిధులతో పాటు చంద్రబాబు దుబాయ్ కు చెందిన పలువురు పారిశ్రామిక వేత్తలతో దుబాయ్ ప్రభుత్వ ప్రతినిధులతో కూడా సమావేశం అయ్యారు. చంద్రబాబు దుబాయ్ టూర్ లో అయన వెంట పరిశ్రమల శాఖ మంత్రి టి జీ భరత్ తో పాటు ఏపీ మౌలికసదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీ సి జనార్దన్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
నవంబర్ 14 -15 తేదీల్లో వైజాగ్ లో జరగనున్న పెట్టుబడుల సదస్సుకు పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించేందుకు సీఎం చంద్రబాబు తో పాటు మంత్రుల బృందాలు పలు దేశాలు పర్యటించాయి. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులతో కలిసి దుబాయ్ టూర్ కు వెళ్లివచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మంత్రి నారాయణ, ఏపీసిఆర్ డీఏ కమిషనర్ కన్నబాబు మరి కొంత మంది అధికారులతో కలిసి దుబాయిలో పర్యటించటం ఇప్పుడు అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ మరో విచిత్రం ఏమిటి అంటే చంద్రబాబు శోభా గ్రూప్ చైర్మన్ తో సమావేశం అయి వస్తే ఇప్పుడు మంత్రి నారాయణ శోభా గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ విక్రమ్ దత్తాతో సమావేశం అయ్యారు. ఆయనతో పాటు మరి కొంత మంది పారిశ్రామిక వేత్తలతో కూడా నారాయణ మంత్రి సమావేశం అయినట్లు ప్రభుత్వం చెపుతోంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లతో పాటు పలువురు మంత్రులు ఈ పెట్టుబడుల సదస్సు పేరుతో విదేశాల్లో పర్యటించి వచ్చారు. అయితే మంత్రుల టూర్ల కు సంబంధించి చేసిన ఖర్చు వివరాలు బయటకు రాకుండా అంతా కూడా ఈడీబీ కి కేటాయించిన బడ్జెట్ నుంచి వాడుకోవాలంటూ పలు జీఓ ల్లో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ సదస్సుపై భారీ ఆశలు, లక్ష్యాలే పెట్టుకుంది.
రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు సాధించే దిశగా ప్రభుత్వం చేసే ప్రయత్నాలను ఎవరూ తప్పుపట్టారు. అయితే ఇందుకు అనుసరించే విధానాలు ఖచ్చితంగా చర్చనీయాంశంగా మారతాయి. కొన్ని కంపెనీలకు ప్రభుత్వం అయాచితంగా వందల కోట్ల రూపాయల భూములు కేటాయించటంతో పాటు ఎడా పెడా రాయితీలు ఇచ్చుకుంటూ పోతోంది. ఇది ఏ స్థాయిలో ఉంటుంది అంటే ఆ కంపెనీ వల్ల రాష్ట్రానికి వచ్చే లాభం కంటే కంపెనీకి పెద్ద ఎత్తున లబ్ది చేకూరుతోంది. దీంతోనే ప్రభుత్వం తీసుకునే కొన్ని నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదం అవుతున్నాయి. టిసిఎస్ లాంటి కంపెనీలకు రాయితీ ధరలతో భూములు ఇచ్చిన కొంత వరకు ఓకే కానీ...రియల్ ఎస్టేట్ సంస్థలకు...పెద్దగా ట్రాక్ రికార్డు లేని కంపెనీ లకు కూడా ఏపీ ప్రభుత్వం వందల కోట్ల రూపాయల భూములు కట్టబెడుతోంది.