మొన్న ఐపీఎస్ ల ఎపిసోడ్..ఇప్పుడు బిల్లుల వ్యవహారం

Update: 2024-08-29 10:51 GMT

వైసీపీ ఐదేళ్ల పాలనలో ఎవరికైనా కోటి రూపాయలపైన ఉన్న బిల్ క్లియర్ కావాలన్నా కూడా అప్పటి సీఎం జగన్, సీఎంఓ లో ఉన్న ధనుంజయ రెడ్డి అనుమతి లేకుండా ఏమి కాలేదు అనే ప్రచారం వైసీపీ వర్గాల్లోనే బలంగా సాగిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై కొంత మంది వైసీపీ నేతలు బహిరంగ విమర్శలు కూడా చేశారు. జగన్ పాలనలో పేరుకు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అయినా కూడా బిల్స్ చెల్లింపులు..ఆర్థిక వ్యవహారాలు అన్ని జగన్ కనుసన్నల్లోనే సాగాయి అని చెపుతారు. ఆంధ్ర ప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం కొలువుతీరి దగ్గర దగ్గర మూడు నెలలు కావస్తోంది. అయినా సరే ఇప్పటికే ఎంతో సీనియర్ నాయకుడిగా పేరున్న చంద్రబాబు నాయుడి కంట్రోల్ లోకి ప్రభుత్వం రాలేదా...లేక వేరే లెక్కలు ఏమైనా ఉన్నాయా అన్న చర్చ టీడీపీ వర్గాల్లో కూడా సాగుతోంది. వరసగా చోటు చేసుకుంటున్న పరిణామాలు అటు కూటమి ప్రభుత్వం పరువుతో పాటు చంద్రబాబు పరువు కూడా తీస్తున్నాయి అనే చర్చ టీడీపీ వర్గాల్లో సాగుతోంది. కొద్ది రోజులు క్రితం వెయిటింగ్ లో ఉన్న ఐపీఎస్ అధికారులు అందరూ విధిగా ప్రతి రోజు డీజీపీ ఆఫీస్ కు వచ్చి సంతకం చేసి వెళ్ళాలి అనే ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ విషయం మంచి చెడుల సంగతి కాసేపు పక్కన పెడితే తర్వాత దీనికి ప్రభుత్వ వర్గాలు చెప్పిన కారణాలు మాత్రం చాలా మందిని షాక్ కు గురి చేశాయి.

                                                                    వెయిటింగ్ లో ఉన్న ఐపీఎస్ అధికారులు జగన్ ప్రభుత్వం పై సాగుతున్న విచారణలు ప్రభావితం చేస్తున్నారు అనే వాదన తెరపైకి తెచ్చారు. కేసు లను కేవలం పైపైనే విచారణ చేసేలా ఒత్తిళ్లు చేస్తున్నారు అనే కోణాన్ని తెరమీదకు తెచ్చారు. అంటే జగన్ కేసు లను విచారిస్తున్న వారు ప్రభుత్వం కంటే వెయిటింగ్ లో ఉన్న అధికారుల మాటలకే విలువ ఇస్తున్నారు అనే సంకేతాలను ప్రభుత్వం ఇచ్చినట్లు అయింది అనే చర్చ అప్పటిలోనే టీడీపీ వర్గాల్లో సాగింది. ఇది ప్రభుత్వం తన పరువు తానే తీసుకున్నట్లు ఉంది అనే వ్యాఖ్యలు కూడా వినిపించాయి. ఇప్పుడు ఏకంగా జగన్ సొంత నియోజకవర్గం పులివెందులకు చెందిన వంద కోట్ల రూపాయల బిల్స్ ఆర్థిక శాఖ క్లియర్ చేసినట్లు వచ్చిన వార్తలు టీడీపీ వర్గాలను కూడా షాక్ కు గురి చేశాయి.

                                                                                                     అంటే అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇటు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కు తెలియకుండానే పులివెందులకు చెందిన కాంట్రాక్టర్లకు వంద కోట్ల రూపాయల చెల్లింపులు జరిగాయి అంటే ఇంతకంటే దారుణం ఏమి ఉంటుంది అనే విషయం తెర మీదకు రావటం ఖాయం. అయితే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మాత్రం తనకు తెలియకుండానే బిల్స్ చెల్లింపులు జరిగినట్లు మీడియా కు లీక్ లు ఇచ్చినట్లు చెపుతున్నారు. అదే నిజం అయితే ఎవరు ఈ చెల్లింపులు చేశారో వాళ్ళను గుర్తించి చర్యలు తీసుకుంటారా లేదా అన్నది ఇప్పుడు కీలకం కాబోతోంది. కేవలం తూతూ మంత్రం నివేదికలతో సరిపుచ్చి ఈ విషయాన్ని మరుగున పడేస్తే మాత్రం తెర వెనక ఏదో జరిగినట్లే అనే అనుమానాలు మరింత పెరగటం ఖాయం. మొన్న ఐపీఎస్ ల విషయంలో...ఇప్పుడు పులివెందుల బిల్స్ చెల్లింపుల విషయం తో పరువు పోయినట్లు అయింది అనే చర్చ టీడీపీ వర్గాల్లోనే సాగుతోంది.

Tags:    

Similar News