తెలుగు దేశం అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి నేరుగా సినిమాలతో సంబంధము లేకపోయినా ఆయన కూడా సినిమా డైలాగులు బాగానే చెపుతారు. ఒక సారి పాత చంద్రబాబు ను చూస్తారు అని..మరో సారి కొత్త చంద్రబాబు చూస్తారు అని చెపుతూ ఉంటారు. తన అవసరాలకు అనుగుణంగా ఈ మాట మార్చుతుంటారు ఆయన. బుధవారం నాడు అమరావతి లో జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తాను తప్ప..మంత్రులు ఎవరూ సరిగా పని చేయటం లేదు అని తేల్చేశారు. మరి ఇందులో జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఐటి, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ లు కూడా ఉన్నారా ? అన్న చర్చ తెర మీదకు వచ్చింది. చంద్రబాబు అయితే చాలా చాలా స్పష్టంగా మంత్రులు ఎవరూ సంతృప్తికరంగా పని చేయటం లేదు అని చెప్పారు అంటే ఇందులో వాళ్ళిద్దరికీ కూడా మినహాయింపు ఏమి లేదు అనే చెప్పొచ్చు అని చెపుతున్నారు.
మరి ఈ వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి. లేదు అంటే ఆయన ఇది తమకు కాదు అని మౌనంగా ఉంటారా అన్నది కూడా తేలాల్సి ఉంది. ‘మంత్రులెవ్వరూ సంతృప్తికరంగా చేయటం లేదు. మహిళా ఎమ్మెల్యేను వైసీపీ నేతలు కించపరిస్తే వెంటనే ఎందుకు స్పందించలేదు. జరుగుతున్న రిణామాలపై ప్రతి మంత్రి అప్రమత్తంగా ఉండాలి. నిత్యావసరాల ధరలు గణనీయంగా తగ్గించాం . నిత్యావసర ధరలు తగ్గించి ప్రజలకు లభ్ధి చేకూర్చడంలో మంత్రివర్గ ఉపసంఘం బాగా కృషి చేసింది. చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యారు. ఏపీలో ఏ నిత్యావసర వస్తువు ధర ఎంత మేర తగ్గిందో మీరు కూడా తెలుసుకోండి. ఇండోసోల్‍కి భూములు వద్దని రైతులను రెచ్చగొట్టించిందే జగన్.
అదే జగన్ పరిశ్రమలు తరలిపోతున్నాయ్ అంటూ తన మీడియాలో తప్పుడు రాతలు రాయిస్తున్నాడు. ప్రభుత్వ బ్రాండ్ దెబ్బ తీసేలా వివిధ సంస్థలకు ఈ మెయిళ్లు పెట్టడంపై సీరియస్ అయిన చంద్రబాబు . పెట్టుబడులు అడ్డుకునేలా వైసీపీ చేస్తున్న కుట్రలపై విచారణ చేయిస్తా . రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా వైసీపీ కుట్రలు పన్నుతోందనే అంశాన్ని కెబినెట్ భేటీలో ప్రస్తావించిన మంత్రి పయ్యావుల. ఏపీఎండీసీ జారీ చేసిన బాండ్లల్లో పెట్టుబడులు పెట్టొద్దంటూ ఏకంగా 200 దేశ, విదేశీ కంపెనీలకు తప్పుడు ఈ మెయిళ్లు పెట్టారని సీఎం దృష్టికి తీసుకెళ్లిన ఆర్థిక మంత్రి. వైసీపీనే తమ పార్టీ సానుభూతిపరుడితో ఈ మెయిళ్లు పెట్టించిందని సీఎంకు ఆధారాలు చూపిన పయ్యావుల. తప్పులు చేసి.. ఆ తప్పులను ప్రత్యర్థుల మీదకు నెట్టేయడమనే కుట్రలను మొదటి నుంచి వైసీపీ అమలు చేస్తూనే ఉందన్న సీఎం. నిధులు రాకుండా తెర వెనుక అడ్డుకోవడం.. పథకాలు అమలు చేయడం లేదని ప్రజల్లో దుష్ప్రచారం చేయడం ఆ పార్టీకి అలవాటుగా మారింది. ఇలాంటి వాటి విషయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. ’ అంటూ మంత్రులకు క్లాస్ తీసుకున్నారు.