వైసీపీ అధికారిక పేస్ బుక్ పేజీలో చంద్రబాబు మార్ఫింగ్ ఫోటో

Update: 2023-10-11 08:11 GMT

Full Viewరాజకీయాలకు..రాజకీయ పార్టీలకు ఇప్పుడు సోషల్ మీడియా ఒక ప్రధాన అస్త్రం అయిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో తాము చేసింది చెప్పుకోవటం ఒకెత్తు అయితే...ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీలపై బురద చల్లటమే ప్రధాన అజెండాగా పార్టీలు అన్నీ నడుస్తున్నాయి. ఇందులో పెద్దగా ఎవరికీ మినహాయింపులు లేవు. ఇంచుమించు అన్ని పార్టీలది అదే దారి. కాకపోతే అధికారంలో ఉన్న వాళ్లకు ఎంతో కొంత బాధ్యత ఎక్కువ ఉంటుంది. కానీ ఆంధ్ర ప్రదేశ్ లోని అధికార వైసీపీ మాత్రం ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయినట్లు కనిపిస్తోంది. ఏకంగా వైసీపీ సోషల్ మీడియా అధికారిక పేజీ లోనే తెలుగు దేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో ను అభ్యంతరకరంగా పెట్టారు. ఈ ఫోటో కింద ఏకంగా గజదొంగ చంద్రబాబు అని పెట్టి..చంద్రబాబు కు షాక్ ఇచ్చినట్లు..జుట్టు అంతా నిక్కబొడుచుకున్నట్లు మార్చారు. అంతే కాదు చంద్రబాబు బుగ్గపై...నుదిటిపై నల్లటి మచ్చలతో ఫోటోను మార్ఫింగ్ చేశారు. అదే పేజీ లో జగనన్న ఆరోగ్య సురక్ష లోగో. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఫోటో ను పెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేస్ బుక్ పేజీని ఫాలో అయ్యే వారి సంఖ్య 12 లక్షల (1 .2 మిల్లియన్ల) మంది ఉన్నారు.

                        ప్రతిపక్ష తెలుగు దేశం పేస్ బుక్ పేజీని ఫాలో అయ్యే వారి సంఖ్య 41 లక్షల మంది. అధికార వైసీపీ ఏకంగా తన అధికారిక పేజీ హెడర్ లోనే ఇలా ప్రతిపక్ష పార్టీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఫోటోను అభ్యంతరకరంగా పెట్టడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇక వైసీపీ అనధికారిక సోషల్ మీడియా పేజీల్లో ఈ వ్యవహారం, విమర్శలు అయితే మరింత దారుణంగా ఉన్నాయి. వైసీపీ అధినేత, సీఎం జగన్ అయితే తాము అసలు ఎక్కడా పద్ధతి తప్పమని చెపుతూ వస్తారు. కానీ మరి ఇప్పుడు పార్టీ అధికారిక పేజీ ద్వారా చేస్తున్నది ఏంటి?. అయితే ఇక్కడ ఒక విషయం ప్రస్తావించాలి. తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉండగా వైసీపీ అధినేత జగన్ ఫోటో ను కూడా అచ్చం ఇలాగే చేసి సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. గత కొంత కాలంగా ఆంధ్ర ప్రదేశ్ లోని అధికార వైసీపీ ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ లు పెడితేనే కేసు లు పెట్టి అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు ఏకంగా అధికార వైసీపీ వైఎస్ఆర్ సిపీ సీఎం జగన్ ఫోటో పక్కనే మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు మార్ఫింగ్ ఫోటో పెట్టడం ద్వారా ఏమీ సందేశం పంపుతున్నట్లు. అధికార పార్టీ కి రూల్స్ వర్తించవా?!.

Tags:    

Similar News