పీఆర్సీ కోసం ఉద్యమించిన ఉద్యోగుల చలో విజయవాడ సక్సెస్ ఓ సంచలనం కిందే చెప్పొచ్చు. ఎందుకంటే ఏపీలో గత మూడేళ్ళ కాలంలో అంతటి భారీ జనసమీకరణ జరిగింది లేదు..ఆ తరహా విజువల్స్ కన్పించిందిలేదు. సీఎం జగన్ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చినా ప్రజల్లో పెద్దగా చలనం రాలేదు. కానీ పీఆర్సీ అనేది ఉద్యోగుల సొంత వ్యవహారం కావటంతో వేలాదిగా ఒక్కసారిగా కదిలివచ్చారు. దీంతో విజయవాడ రహదారులు అన్నీ నిండిపోవటం..ఆ ఫోటోలు..డ్రోన్ విజువల్స్ చూసిన వారెవరికైనా ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత ఉందా అన్న ఫీలింగ్ తీసుకొచ్చింది. ఇది ప్రభుత్వానికి ఏ మాత్రం నచ్చలేదు. అందుకే చలో విజయవాడ అనంతరం ఏపీ డీజీపీ ప్రత్యేకంగా సీఎం జగన్ తో భేటీ అయ్యారు. దీనిపై వివరణ కూడా ఇచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. పోలీసుల సహకారం లేకుండా అసలు అనుమతి లేని చలో విజయవాడకు అంత సంఖ్యలో రావటం అనేది జరిగే పని కాదని ప్రభుత్వం భావించింది.
ఓ వైపు విజయవాడకు నాలుగు దిక్కులా చెక్ పోస్టులు పెట్టి రైళ్లు..బస్సులు, కార్లు అన్నీ తనిఖీ చేసి అనుమతించినా కూడా చలో విజయవాడ సక్సెస్ వైసీపీ సర్కారుకు ఓ షాక్ గా మారింది. ఆ షాక్ కు ప్రతిఫలమే ఇప్పుడు డీజీపీ గౌతం సవాంగ్ బదిలీ అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వచ్చేది అసలే ఎన్నికల సీజన్. రాబోయే రోజుల్లో కూడా ఇదే తరహాలో ఉంటే ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే గౌతం సవాంగ్ ను డీజీపీ పదవి నుంచి తప్పించారని చెబుతున్నారు. బదిలీ చేసి పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశించారు. గౌతమ్ సవాంగ్ కు 2023 జూలై వరకు సర్వీస్ ఉంది. ఇప్పుడు ఆయన్ను ఎక్కడ ఎకామిడేట్ చేస్తారన్నది ఆసక్తికర పరిణామంగా మారింది.