చంద్రబాబు, నారా లోకేష్ పాలనా మోడల్ మారింది!
తెలుగు దేశం అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడూ తాను మారతాను..మారతాను అని చెపుతారు. కానీ ఇంత వరకు అది జరిగింది లేదు. ఇదే టీడీపీ పార్టీ నేతల నిశ్చిత అభిప్రాయం కూడా. ఇక్కడ ఇంకో కీలక విషయం ఏమిటి అంటే ప్రతిపక్షంలో ఉంటే కార్యకర్తలే నా ప్రాణం అంటారు...అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే రూట్ మార్చి అసలు ఆ సంగతే మర్చిపోతారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన అధికారులు ఏది చెపితే అదే చేస్తారు తప్ప..పార్టీ కోణంలో ఏ మాత్రం ఆలోచించరు అనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ ని నిర్లక్ష్యం చేశాను..ఈ సారి మాత్రం అలా జరగదు అని ఓడిపోయిన ప్రతి సందర్భంలో చంద్రబాబు చెప్పారు. గెలిచిన ప్రతిసారి ఆ సంగతి మర్చిపోతారు ఎప్పటిలాగానే. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది అనే విమర్శలు ఎదుర్కొంటున్నారు.
టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ అయితే ఏకంగా మొన్నటి మహానాడు లో అయితే కార్యకర్తే అధినేత అనే కొత్త ఆకర్షణీయ స్లోగన్ తీసుకొచ్చారు. కార్యకర్తే అధినేత అని చెప్పి వదిలేస్తే చాలు...ఇక వాళ్ళ గురించి ఏమి పట్టించుకున్నా ...పట్టించుకోకపొయినా పర్వాలేదు అన్నట్లు ఉంది వీళ్ళ తీరు అని ఆ పార్టీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు. ఇతర పార్టీ లతో పోలిస్తే టీడీపీ కొంత మంది కార్యకర్తలకు బీమా సౌకర్యం కల్పిస్తోంది. అవసరాన్ని ఇతర సహాయాలు కూడా చేస్తూ ఉంటుంది. అయితే కొంత మంది నేతలు చంద్రబాబు ఈ టర్మ్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత పదే పదే జపం చేస్తున్న పీ 4 మోడల్ లో ఒక విధానాన్ని పార్టీ లో అమలు చేయాలని కొంత మంది నేతలు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంతో మంది తెర వెనక ఉండి టీడీపీ కి రకరకాలుగా సాయం చేశారు అని...అలాంటి వాళ్ళను ఇప్పుడు పూర్తిగా వదిలేశారు అనే విమర్శలు ఉన్నాయి. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలాంటి ప్రయోజనం ఆశించకుండా పార్టీ కోసం పని చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అని...కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు వాళ్ళ వైపు కన్నెత్తి చూడకుండా...వైసీపీ హయాంలో ఒక వెలుగువెలిగిన వాళ్లనే తిరిగి పార్టీ నమ్ముకుంటోంది అనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లు ఫస్ట్ పార్టీ కోసం ఎలాంటి ప్రయోజనాలు ఆశించకుండా తెర వెనక ఉండి పని చేసిన వాళ్లకు ఆదుకోవాలనే డిమాండ్ ను కొంత మంది నాయకులు తెర మీదకు తెస్తున్నారు. జగన్ హయాంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళను కూడా పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు అని...అదే సమయంలో పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంతో మంది తెర వెనక ఉండి పార్టీ కోసం పని చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అని ఒక సీనియర్ మంత్రి వెల్లడించారు. అధికారంలోకి వచ్చినప్పుడు పార్టీ కోసం సిన్సియర్ గా పనిచేసిన వాళ్ళను పీ 4 మోడల్ లోనో...లేక మరో మోడల్ లోనే ఆదుకుంటే వాళ్ళు ఎప్పుడు అవసరం అయినా కూడా పార్టీ కోసం పని చేస్తారు అని మరో సీనియర్ నేత అభిప్రాయపడ్డారు.
కానీ ఎప్పుడూ ఎన్నికల సమయంలో పెద్ద పెద్ద ప్రకటనలు చేసి అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు వాటిని పూర్తిగా మర్చిపోతుంటారు అని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. బ్యాక్ ఎండ్ టీం కోసం ఒక మెకానిజం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అని చెపుతున్నారు. చంద్రబాబు జపం చేస్తున్న పీ 4 తో పేదరిక నిర్ములన అన్నది జరిగే పని కాదు అని...పీ 4 మోడల్ స్కీం పార్టీలో అమలు చేస్తే పార్టీ కోసం పని చేసే టీం చెక్కు చెదరకుండా ఉంటుంది అని మరో నేత వ్యాఖ్యానించారు. ఇప్పుడు పీ 4 లో మార్గదర్శకులుగా చెపుతున్న వాళ్ళు అంతా చంద్రబాబు సర్కారు నుంచి పెద్ద ఎత్తున కాంట్రాక్టు లు...లేదా ఇతర ప్రాజెక్ట్ లు పొందిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు అని టీడీపీ వర్గాలు చెపుతున్నాయి. అంతే కానీ వాళ్లకు చంద్రబాబు చెపుతున్నట్లు పేదలను పైకి తీసుకురావాలనే ప్రేమతో చేసే వాళ్ళు కాదు అని పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.