ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ విమర్శలపై స్పందించారు. ఆడిట్ సంస్థ సందేహలు వ్యక్తం చేసిందని..వాటికి ప్రభుత్వం సమాధానం ఇస్తుందని తెలిపారు. ఆడిట్ సంస్థ అభ్యంతరాలపై ఇంకా ఆడిట్ ఏమి ఉంటుందని ప్రశ్నించారు. సహజంగా ఇలాంటి విషయాల్లో మాజీ ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామక్రిష్ణుడు ముందు ఉంటారని..ఆయన రాకుండా పయ్యావుల కేశవ్ కు వదిలేశారంటే ఇందులో ఏమీలేదనే విషయం ఆయనకు అర్ధం అయినట్లు ఉందని అన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై అనుమానాలు వ్యక్తం చేసేలా వ్యవహరించటం తగదన్నారు. పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ఆరోపణలు అర్ధరహితమని రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు.
మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆడిట్ చేసినప్పుడు పలురకాల ప్రశ్నలు వేస్తారని.. ఆడిట్ సంస్థ ప్రశ్నలను ఆధారంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారని తప్పుపట్టారు.సందేహాలు ఉంటే మీటింగ్ పెట్టి పరిష్కరించుకోవచ్చని.. లేఖలు రాయటం వల్ల ప్రయోజనం ఏంటో అర్థం కావట్లేదన్నారు. బిల్లులు లేకుండా డబ్బులు చెల్లించారన్నది అవాస్తవమని మంత్రి తెలిపారు. రూ.41 వేల కోట్లకు పూర్తి లెక్కలు ఉన్నాయని.. ప్రతిపక్షం నిజాలు తెలుసుకుని మాట్లాడాలని మంత్రి బుగ్గన హితవు పలికారు. గవర్నర్ కు..ఢిల్లీకి లేఖలు రాయటం ఏమిటో అర్ధం కావటంలేదన్నారు. ఈ గందరగోళానికి సీఎఫ్ ఎంఎస్ కారణం అని ఆరోపించారు. ఇది తెచ్చింది కూడా టీడీపీ ప్రభుత్వమే అని...ఇంతటి కీలక వ్యవస్థను చంద్రబాబు హయాంలో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారని తెలిపారు.