అమరావతి..మూడురాజధానులపై కెసిఆర్ మౌనం!

Update: 2023-01-03 05:40 GMT

ఆంధ్ర ప్రదేశ్ లోనూ జాతీయ ఎజెండా తోనే బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఎన్నికలకు వెళతారా?. దేశం విషయంలో అయితే అంతకు ముందు పాలించిన కాంగ్రెస్..ఇప్పుడు పాలిస్తున్న బీజేపీ లకు పాలన చేతకాకపోవటం వల్లే భారత్ ఇలా ఉంది అని కెసిఆర్ చెపుతున్నారు. మరీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాఖ నూతన అధ్యక్షుడిని ప్రకటించిన సమయంలో ఆ రాష్ట్రానికి సంబదించిన కీలక అంశాలపై పార్టీ అధినాయకుడి స్పందన..డైరెక్షన్ కోసం ఎవరైనా చూస్తారు. నిన్నటి కెసిఆర్ స్పీచ్ చూస్తే అయన జాతీయ అంశాలపై తప్ప ..ఆంధ్ర ప్రదేశ్ లోని కీలక అంశాలను విస్మరించారు. ఒక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశాన్ని మాత్రమే ప్రస్తావించారు. ఇప్పుడు ఏపీలో కీలకంగా ఉన్న అమరావతి కి కెసిఆర్ మద్దతు ఇస్తారా...లేక సీఎం జగన్ తెరపైకి తెచ్చిన మూడు రాజధానులు సరైనవి అని చెపుతారా అని అంతా ఎదురు చూశారు. కానీ కెసిఆర్ మాత్రం ఈ అంశంపై స్పష్టత ఇవ్వలేదు. అంతే కాదు ప్రస్తుత సీఎం జగన్ గురించి కానీ..మాజీ సీఎం , టీడీపీ అధినేత చంద్రబాబు గురించి కానీ కెసిఆర్ ఒక్క మాట మాట్లాడలేదు. దీంతో కెసిఆర్ వైఖరి ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు తో పోలిస్తే జగన్ తోనే కెసిఆర్ కు సత్సంబంధాలు ఉన్నాయి. ఒక వైపు జగన్ పార్టీ తెలంగాలో పోటీ చేయం అని చెపుతుంటే .మరో వైపు చంద్రబాబు తెలంగాణ టీడీపీ ని రీ ఆక్టివేట్ చేశారు.

                                      ప్రస్తుతానికి మౌనంగా ఉన్నా రాబోయే రోజుల్లో కెసిఆర్ దీనిపై స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది అనే విషయం తెలిసిందే. ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన వాళ్ళు హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఉన్న విషయం తెలిసిందే. కెసిఆర్ కి ఈ ఓట్లు అత్యంత కీలకంగా ఉంటాయి. ఇతర జిల్లాలతో పోలిస్తే కృష్ణా, గుంటూరు జిల్లాల వాళ్లే కొంత ఎక్కువ ఉంటారు అనే లెక్కలు కూడా ఉన్నాయి. ఇవన్నీ లెక్కలు తీసి తర్వాత ఈ అంశంపై స్పష్టత ఇస్తారా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్నది కొద్దికాలం పోతే కానీ తెలియదు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ బిఆర్ఎస్ పేరుతో తమ పార్టీ ని దేశ వ్యాప్తంగా విస్తరించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా తొలుత ఆంధ్ర ప్రదేశ్ శాఖకు ప్రెసిడెంట్ ను నియమించారు. సంక్రాంతి తర్వాత ఇతర రాష్టాల్లోను కార్యక్రమాల వేగం పెంచాలని నిర్ణయించినట్లు తాజాగా ప్రకటించారు. 

Tags:    

Similar News