తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు గురువారం నాడు కోనసీమలో వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లారు. చంద్రబాబుతోపాటు టీడీపీ సీనియర్ నేతలు కూడా ఉన్నారు. ఈ పర్యటనలోనే పడవ ప్రమాదం చోటుచేసుకుంది. పర్యటన సమయంలో ఓ పంటు పడవను డీకొట్టడంతో అందులో ఉన్న టీడీపీ నేతలు నీళ్లలో పడిపోయారు. ఇందులో దేవినేని ఉమ, పితాని సత్యనారాయణ,రాధాకృష్ణ, అంగర రామ్మోహన్, మంతెన రామరాజు ఉన్నారు. ఒడ్డుకు సమీపంలోనే ప్రమాదం జరగటంతో వెంటనే జాలర్లు కూడా రంగంలోకి దిగి వీరిని కాపాడారు. దీంతో ప్రమాదం తప్పినట్లు అయింది.
రాజోలులంక దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. తర్వాత అందరూ కలసి వరద బాధితుల పరామర్శకు బయలుదేరారు. అంతకు ముందు చంద్రబాబు వరద బాధితుల కష్టాలను ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవటం లేదని విమర్శించారు. తెలంగాణలో బాధిత కుటుంబానికి పది వేల రూపాయల సాయం ప్రకటించారని..మరి రాష్ట్రంలో అలా ఎందుకు చేయరని ప్రశ్నించారు. ఇళ్లు నష్టపోయిన వారిని కూడా ఆదుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.