తిరుపతి లడ్డు వ్యవహారం లో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లకు బిగ్ షాక్ తగిలింది. ఈ వ్యవహారంపై దాఖలు అయిన పిటీషన్స్ పై విచారణ జరిపిన సుప్రీం కోర్ట్ చేసిన వ్యాఖ్యలు అత్యంత సున్నితమైన ఈ విషయంలో ఈ ఇద్దరు నేతలను ఇరకాటంలోకి నెట్టాయి. కనీసం దేవుడిని ఆయినా రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ తో కాకుండా స్వతంత్ర సంస్థతో విచారణకు ఆదేశిస్తే మాత్రం ఇది మరింతగా అటు చంద్రబాబు తో పాటు పవన్ కళ్యాణ్ కు ఇరకాటంలోకి నెట్టినట్లు అవుతుంది అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. ఐదేళ్ల జగన్ పాలనలో తిరుపతి లడ్డులో నాణ్యతగా తగ్గింది అని...భక్తులకు కల్పించే సౌకర్యాల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం చేసారు అనే విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. కానీ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత చంద్రబాబు నాయుడు సడన్ గా తిరుపతి లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది దేశ వ్యాప్తంగా పెద్ద కలకలం రేపింది. కోట్లాది మంది భక్తులు కొలిచే వెనకటేశ్వర స్వామి దేవాలయం విషయంలో ఇంత దారుణం జరిగితే..అదే నిజం అయితే ముఖ్యమంత్రి పక్కా ఆధారాలతో వెంటనే కేసు పెట్టించి...ఇందుకు బాద్యులైన వారి పై చర్యలు తీసుకోవాలి కానీ..యధాలాపంగా ఒక మీటింగ్ లో ఈ అంశాన్ని ప్రస్తావించడంపై పెద్ద చర్చ సాగింది.
కానీ ఎప్పుడో జులై లో నెయ్యి కల్తీ విషయం వెలుగులోకి వస్తే మొన్న మొన్నటి వరకు చంద్రబాబు ఎలాంటి చర్యలకు ఉపక్రమించకుండా దీనిపై ప్రకటన చేయటం వివాదానికి కారణం అయింది. సోమవారం నాడు తిరుపతి లడ్డూ వివాదంపై విచారణ జరిపిన సుప్రీం కోర్ట్ లోని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగించారనడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా?. నెయ్యి కల్తీ అయింది అన్న రిపోర్ట్ పై సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా?. కల్తీ నెయ్యిని లడ్డూలో వాడారో లేదో పూర్తిగా తెలియకుండా ముఖ్యమంత్రి ఎలా ప్రకటన చేస్తారని సుప్రీంకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తరుణంలో సిట్ విచారణ సరిగా విచారణ జరుపుతుంది అని నమ్మగలమా అని సందేహం వ్యక్తం చేసింది. కల్తీ నెయ్యి వాడకంపై సీఎం ప్రకటనకు, టీటీడీ ఈఓ ప్రకటనకు మధ్య ఉన్న తేడా గురించి కూడా ప్రస్తావించారు. దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన అంశంలో సుప్రీం కోర్ట్ వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వానికి షాక్ వంటివే అని చెప్పాలి. ఈ విషయంలో ఒక ప్రకటన చేసి చంద్రబాబు తర్వాత తన పని తాను చేస్తే..ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రం దీనిపై నానా హంగామా చేశారు. ఇక్కడా అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు తాము అధికారంలో ఉన్నాం...ప్రతిపక్షంలో కాదు అన్న విషయం మర్చిపోయారు అనే విమర్శలు వ్యక్తం అయ్యాయి.