ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులు కోరుకున్నది అదే. అప్పులు ఇస్తున్న..విదేశీ ఏజెన్సీల నుంచి భారీ మొత్తంలో నిధులు సమకూర్చుతున్న కేంద్రం కూడా ఈ సారి జాగ్రత్తలు తీసుకొంటోంది. దీంతో రాబోయే రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతితో ఆటలు ఆడటం సాధ్యం కాదు అనే చెప్పొచ్చు. ఇది రాష్ట్రానికే కాకుండా..భూములు ఇచ్చిన రైతులకు కూడా ఎంతో ఊరట కలిగించే పరిణామం. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎన్ని వివాదాలు తలెత్తినా కూడా రాజధాని అమరావతికి అందరూ ఒకే చెప్పారు. అప్పటి ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి కూడా ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం ఇష్టం లేక అమరావతికి ఒప్పుకుంటున్నట్లు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరూ ఊహించని రీతిలో మూడు రాజధానుల నినాదం తీసుకొచ్చి మొత్తం వ్యవహారాన్ని గందరగోళంలోకి నెట్టారు. దీంతో రాజధాని విషయం కోర్టు కి ఎక్కింది...అమరావతి అట కెక్కింది. ఆంధ్ర ప్రదేశ్ లో రెండవసారి టీడీపీ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అమరావతి గాడిన పడుతున్న విషయం తెలిసిందే.
రాబోయే రోజుల్లో ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా రాజధాని విషయంలో ఆటలు ఆడకుండా ఉండేందుకు పార్లమెంట్ సాక్షిగా దీనికి చట్టబద్దత కల్పించబోతున్నారు. ఇప్పటికే దీనికి న్యాయశాఖ ఆమోదం కూడా దక్కింది. రాష్ట్ర విభజన చట్టంలో మార్పులు చేసి మరీ ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా అమరావతి పేరును పేర్కొంటూ పార్లమెంట్ లో చట్ట సవరణ చేసి గెజిట్ జారీ చేయబోతున్నారు. ఈ ప్రక్రియ పూర్తి అయితే రాజధాని విషయంలో ఉన్న అనుమానాలు ..గందరగోళాలకు శాశ్వతంగా తెరపడినట్లు అవుతుంది. పార్లమెంట్ లో ఈ మేరకు చట్ట సవరణ చేయటం ఎన్డీయే ప్రభుత్వానికి పెద్ద కష్టం కాదు. దీన్ని వ్యతిరేకించే వారు కూడా ఇందులో పెద్దగా ఎవరూ ఉండరనే చెప్పొచ్చు. తాజా పరిణామాలతో రాజకీయ కారణాలు ..లేక ఇతర అంశాల ఆధారంగా అందరికి చెందిన రాజధాని తో ఆటలు ఆడుకోవటానికి ఇక దారులు పూర్తిగా మూసుకుపోతాయి అనే చెప్పొచ్చు.
అధికారంలో ఉన్న వాళ్ళు నిజంగా ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే ఆ ప్రాంతాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయవచ్చు. కానీ తాము తీసుకునే నిర్ణయాలను సమర్ధించుకునేందుకు కొత్త కొత్త వాదనలు తెరపైకి తీసుకొస్తారు అనే విషయం తెలిసిందే. మూడు రాజధానుల నిర్ణయం సమయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇదే పని చేశారు. కానీ ఆయన ప్లాన్స్ అన్ని రివర్స్ కొట్టాయి. ఇక అమరావతికి పార్లమెంట్ సాక్షిగా చట్టబద్దత వస్తుండంతో ఈ ప్రాజెక్ట్ ను చంద్రబాబు ఎంత విజయవంతగా పూర్తి చేస్తారు అన్నదే ఇప్పుడు అత్యంత కీలకంగా మారబోతోంది. అయితే ఈ సమావేశాల్లోనే అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లు ఆమోదం పొందుతుందా...లేక వచ్చే సమావేశాల వరకు పడుతున్నదే అన్నది మాత్రమే తేలాల్సి ఉంది.