అప్పుడు ఎయిర్ పోర్ట్ ..ఇప్పుడు ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ

Update: 2025-12-15 15:55 GMT

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జీఎంఆర్ సంస్థకు మధ్య ఉన్న బంధం ఎంతో బలమైంది. అది ఎంతగా అంటే రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ప్రాజెక్ట్ ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్ పోర్ట్స్ అథారిటీ అఫ్ ఇండియా (ఏఏఐ) దక్కితే...ఆ టెండర్ రద్దు చేసి మరీ మళ్ళీ కొత్తగా టెండర్లు పిలిచారు. ఇది అంతా కేవలం జీఎంఆర్ ఎయిర్ పోర్ట్స్ కు ఈ ప్రాజెక్ట్ దక్కేలా చేయటం కోసమే అనే విమర్శలు అప్పటిలో పెద్ద ఎత్తున వినిపించాయి. ఈ టెండర్ కండిషన్లపై కూడా అప్పటి ఆర్థిక శాఖ అధికారులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం తాను అనుకున్నట్లే ముందుకు వెళ్లారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రాజెక్ట్ ను జీఎంఆర్ కు దక్కేలా చేశారు అని అప్పటిలో అధికారులు కూడా వెల్లడించారు. ఈ డీల్ ని తీవ్రంగా వ్యతిరేకించిన అప్పటి ప్రతిపక్ష నేత...మాజీ సీఎం జగన్ ఇందులో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అని ఆరోపించి...తర్వాత ఈ ప్రాజెక్ట్ కు కేటాయించిన భూమిలో ఐదు వందల ఎకరాలు తగ్గించి ఎయిర్ పోర్ట్ ప్రాజెక్ట్ ను జీఎంఆర్ కే కేటాయించారు.

                                     దీని కోసం తెర వెనక ఎన్నో వ్యవహారాలు జరిగాయి అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. టీడీపీ రెండవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ హయాంలో కట్ చేసిన ఐదు వందల ఎకరాలను రకరకాల పేర్లు చెప్పి మళ్ళీ జీఎంఆర్ కే అప్పగించారు. ఇది అంతా పాత కథ. ఇప్పుడు అదే జీఎంఆర్ కు చంద్రబాబు సారథ్యంలోని కూటమి సర్కారు మరో ఫేవర్ చేయటానికి నిర్ణయం తీసుకుంది. టెండర్ లేదు...ఇప్పటి వరకు ప్రభుత్వ పరంగా ఎలాంటి జీవో లు బయటకు వచ్చినట్లు లేవు కానీ మంగళవారం నాడు వైజాగ్ లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కే. రామ్మోహన్ నాయుడు, ఆంధ్ర ప్రదేశ్ ఐటి , విద్యా శాఖల మంత్రి నారా లోకేష్ లు జీఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ ని ప్రారంభించనున్నారు. ట్రస్ట్ భూములను ప్రైవేట్ సంస్థకు ఎలా ఇస్తున్నారు...దీనికి ఎంత లీజ్ ఇస్తున్నారు...తర్వాత ఈ జీఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీకి అదనంగా ప్రభుత్వ భూములు కేటాయిస్తారా వంటి విషయాలు ఏమీ బయటకు చెప్పకుండానే అంతా గుట్టు చెప్పుడు కాకుండా నడిపించేస్తున్నారు.

                                     కాకపోతే ప్రభుత్వం అధికారికంగా భోగాపురంలో దేశంలోనే మొదటి ఏవియేషన్, ఏరోస్పేస్, డిఫెన్స్(AAD) ఎడ్యుసిటీకి శ్రీకారం చుడుతున్నట్లు చెపుతోంది. దేశంలో విమానయానం, ఏరోస్పేస్, రక్షణ రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి అని.... దేశవ్యాప్తంగా 200 విమానాశ్రయాల్లో ప్రయాణికుల రాకపోకలు 700 మిలియన్లకు చేరనున్నట్లు అంచనాగా వెల్లడించారు. . 2030 నాటికి ఈ సంఖ్య రెట్టింపై 1,700కు చేరనుంది. ఏరోస్పేస్, డిఫెన్స్ మార్కెట్ విలువ 2024లో 28.7 బిలియన్ డాలర్ల నుంచి 2034 నాటికి 57 బిలియన్ డాలర్లకు పెరగనుంది అని ప్రభుత్వం పేర్కొంది. విమానయాన రంగంలో నైపుణ్యం కలిగిన మానవవనరుల కొరత తీర్చటానికి ఇది ఎంతో దోహదపడనుంది అని ప్రభుత్వం వెల్లడించింది. దేశంలోనే తొలి సమగ్ర విద్య, ఆవిష్కరణ కేంద్రంగా ఏఏడీ(AAD) ఎడ్యుకేషన్ సిటీ అవతరించనుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ప్రతిపాదిత ఏవియేషన్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్(AAD) ఎడ్యుకేషన్ సిటీ దేశంలోనే ఏఏడీ రంగానికి అంకితమైన ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్, ఇన్నోవేషన్ హబ్. ఇక్కడకు ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలు తరలివస్తాయి. అంతర్జాతీయంగా పేరుగాంచిన యూనివర్సిటీల ఇంటర్నేషనల్ బ్రాంచ్ క్యాంపస్ లు(IBSc) ఏర్పాటుకానున్నాయి.

                                                అడ్వాన్స్డ్ రీసెర్చ్, ఇన్నోవేషన్ సెంటర్లు అప్లైడ్ టెక్నాలజీస్ పై దృష్టిసారిస్తాయి. స్టార్టప్ లు, పరిశ్రమలతో సహకారం కోసం ఇంక్యుబేషన్, ప్రోటోటైపింగ్ సదుపాయాలను కల్పించనున్నారు. చైతన్యం, స్వయం సమృద్ధి గల ఎకోసిస్టమ్ కోసం నివాస, సామాజిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తారు. ఈ ఎడ్యుకేషన్ సిటీ నేషనల్ సివిల్ ఏవియేషన్ పాలసీ(NCAP), ఎన్ఈపీ(NEP)-2020, మేకిన్ ఇండియా, డిఫెన్స్ కారిడార్ లక్ష్యాలకు అనుగుణంగా ఒక జాతీయ సామర్ధ్య వేదికగా పనిచేస్తుంది. ఈ ఎడ్యుకేషన్ సిటీ ద్వారా ఆంధ్రప్రదేశ్ తో పాటు భారతదేశ ఏవియేషన్, ఏరోస్పేస్ ఎడ్యుకేషన్, ఇన్నోవేషన్ లలో గ్లోబర్ లీడర్ గా ఎదగడమే లక్ష్యం. 160 ఎకరాల్లో ఎడ్యుసిటీ క్యాంపస్ ను నిర్మించనున్నారు. తొలుత 160 ఎకరాలు అని చెపుతున్నా తర్వాత ఈ మొత్తం 500 ఎకరాలకు చేరే అవకాశం ఉంది అని అధికార వర్గాలు చెపుతున్నాయి. కొద్ది రోజుల క్రితం మంత్రి నారా లోకేష్ ఢిల్లీ లో జీఎంఆర్ ప్రతినిధులతో సమావేశం అయి ఈ ప్రాజెక్ట్ పై చర్చలు జరిపారు. ఇప్పుడు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు తో కలిసి నారా లోకేష్ ఈ ప్రాజెక్ట్ కు మంగళవారం నాడు శ్రీకారం చుట్టనున్నారు. జీఎంఆర్ కు చంద్రబాబు భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రాజెక్ట్ ఇస్తే..ఆయన తనయుడు, మంత్రి నారా లోకేష్ ఇప్పుడు ఇదే సంస్థకు ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ ని అప్పగిస్తున్నట్లు ఉంది అని అధికార వర్గాలు కూడా వ్యాఖ్యానిస్తున్నాయి. ఇందులోని మతలబులు ఏంటో రాబోయే రోజుల్లో బయటకు వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News