ప్రభుత్వ పెద్దలతో ముందే కోట్ల రూపాయలకు డీల్ కుదుర్చుకుని వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు లు దక్కించుకుంటే ఎలా ఉంటుందో ఇది ఒక ఉదాహరణ అని చెపుతున్నారు అధికారులు. ఆంధ్ర ప్రదేశ్ వైద్య శాఖలో సాగుతున్న ఈ వ్యవహారం చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఎక్కడికి వెళ్లినా ఆ కంపెనీ అధినేత ప్రభుత్వ పెద్దలు అంతా తన చేతుల్లో ఉన్నారు అని...సీఎంఓ లో సైతం తాను ఏది అనుకుంటే అది జరిగిపోతుంది అని చెప్పుకుంటూ తిరుగుతుండటంతో వైద్య ఆరోగ్య శాఖలోని ఉన్నతాధికారులు కూడా పెద్దగా ఆ విషయం పై ఫోకస్ పెట్టడం లేదు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైద్య శాఖలో ఒక అధికారి బదిలీని కూడా ఈ కంపెనీ అధినేత దగ్గర దగ్గర ఏడాది పాటు నిలిపివేశాడు కూడా ఆ శాఖ వర్గాల్లో ప్రచారంలో ఉంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొద్ది నెలల క్రితమే అత్యంత కీలకమైన 108 తో పాటు 104 సర్వీసులు, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టం బాధ్యతలను భవ్య హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కు అప్పగించింది.
ఈ సంస్థ బెంగళూరు కు చెందిన ఎస్ఆర్ఐటి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసి ఈ కాంట్రాక్టు దక్కించుకుంది. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే గత జగన్ సర్కారులో చెల్లించిన మొత్తం కంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ సంస్థకు పెద్ద ఎత్తున అదనపు మొత్తాలు చెల్లిస్తోంది అని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే గత ప్రభుత్వం కంటే ఇప్పుడు అదనంగా చెల్లింపులు చేస్తున్నా కూడా సర్వీస్ లు మాత్రం అత్యంత దారుణంగా ఉన్నాయనే విమర్శలను ఇప్పుడు కంపెనీ ఎదుర్కొంటోంది. కొద్ది రోజుల క్రితమే వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 108 సర్వీసులపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. 108 అంబులెన్స్ సరైన సమయానికి రాకపోవడంతో ఓ పసికందు ప్రాణాలు కోల్పోయిందంటూ జగన్ ఆరోపించారు. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన అత్యవసర సేవలను ప్రస్తుత ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని విమర్శిస్తూ ఈ ఘటనకు సంబంధించిన వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసి, ప్రభుత్వ తీరును తప్పుబట్టారు.
దీనిపై ప్రభుత్వం పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు అనే చెప్పొచ్చు. ఒక్క 108 విషయంలో కాదు...ఇప్పుడు 104 సర్వీసుల విషయంలో కూడా భవ్య హెల్త్ సర్వీసెస్ ఎలాంటి పరీక్షలు చేయకుండానే కేవలం మందులు ఇస్తూ ఒప్పందాన్ని ఉల్లంగిస్తున్నట్లు చెపుతున్నారు. అయినా కూడా ప్రభుత్వం..వైద్య శాఖ ఈ విషయంలో చూసీచూడనట్లు వదిలేస్తున్నాయి. ఇది అంతా కూడా పై వాళ్ళతో ఉన్న ఒప్పందం ప్రకారమే జరుగుతుంది అనే అనుమానాలు కూడా లేకపోలేదు. 108 సర్వీసులతో పాటు 104 సర్వీసులను కూడా సరిగా నిర్వహించకుండా గత ప్రభుత్వం కంటే ఇప్పుడు ఈ కంపెనీ అదనపు చెల్లింపులు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో అర్ధం కావటం లేదు అని ఆ శాఖ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
108 , 104 సర్వీస్ ల కాంట్రాక్టు కోసం ఒక ముంబై కంపెనీ టెండర్ వేసినా కూడా భవ్య హెల్త్ సర్వీసెస్ కోసం ఆ కంపెనీ టెండర్ ని రిజెక్ట్ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. వాస్తవానికి ఆ సంస్థకు అర్హత ఉంది అని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. గతంలో పెద్ద పెద్ద కంపెనీలు చేసిన ఈ పని ని ఇప్పుడు ప్రభుత్వంలోని పెద్దలు తమకు కావాల్సిన వాళ్లకు ఈ టెండర్ కేటాయించి భారీ ఎత్తున లబ్దిచేకూర్చినట్లు చెపుతున్నారు. భవ్య హెల్త్ సర్వీస్స్ అధినేత దోనేపూడి పవన్ కుమార్ కు టీడీపీ పెద్దలతో ఎప్పటి నుంచో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.