ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ పెద్దల దగ్గర నుంచి అంతా ఒక ఎజెండా ప్రకారమే పని చేస్తున్నారు అనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున స్కాం లు చేశారు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీలకు కూడా ఏపీ సర్కారు రెడ్ కార్పెట్ పరిచిన విషయం తెలిసిందే. ఇదే అదనుగా ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న మంత్రులు కూడా తాము ఎందుకు తగ్గాలి అన్నట్లు వాళ్ళు నేరుగా రంగంలోకి దిగటమే కాకుండా...ఏకంగా కుటుంబ సభ్యులను కూడా రంగంలోకి దింపారు అనే చర్చ పెద్ద ఎత్తున పార్టీ వర్గాల్లో సాగుతోంది. ముఖ్యంగా ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న మంత్రి ఒకరు తన ఇద్దరు కొడుకులను కూడా రంగంలో దింపి ప్రభుత్వం శాఖలు కేటాయించినట్లు సబ్జెక్టు లు కూడా కేటాయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
దీని ప్రకారం మంత్రి కొడుకుల్లో ఒకరు బిల్స్ వ్యవహారం చూస్తుంటే...మరొకరు మైనింగ్ వ్యవహారాలు చూస్తున్నట్లు చూపుతున్నారు. గత కొన్ని నెలలుగా ఈ వ్యవహారం సాగుతున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. దీని కోసం హైదరాబాద్ లో కూడా ఒక ఆఫీస్ కూడా పెట్టినట్లు చెపుతున్నారు. ఆ మంత్రి పైకి తన అంత నిజాయతీపరుడు లేరన్నట్లు కలరింగ్ ఇస్తారు కానీ..తెర వెనక ఆయన చేసే వ్యవహారాలు మాములుగా ఉండవు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అప్పటి అధికార పార్టీ పెద్దలతో కలిసి ఆయన ఎన్నో సెటిల్మెంట్స్ చేసినట్లు కూడా టీడీపీ వర్గాల్లో ప్రచారంలో ఉంది.
మంత్రి ఇద్దరు కొడుకులు రంగంలోకి దిగిన తర్వాత ఎప్పటి నుంచో తనకు సన్నిహితంగా ఉన్న వాళ్ళను కూడా పూర్తిగా పక్కన పెట్టేసి మొత్తం వ్యవహారాన్ని ఫ్యామిలీ ప్యాకేజీ గా మార్చినట్లు చెపుతున్నారు. ఆ ముదురు మంత్రి తన పనులు అన్నీ సాఫీగా సాగేలా చూసుకునేందుకు సీఎంఓ లోని కొంత మంది తో కలిసి ఒక టీం గా ఏర్పడినట్లు ప్రభుత్వం వర్గాలు చెపుతున్నాయి. పలు విషయాల్లో వీళ్ళు అంతా కలిసి తెర వెనక వ్యవహారాలు నడిపిస్తున్నట్లు చెపుతున్నారు. తాను చూసే శాఖ పనుల్లో పెద్దగా స్పీడ్ ఉండదు కానీ ఆయన తన పనులు యమా స్పీడ్ గా చేసుకుంటున్నట్లు అధికారులు కూడా చెపుతున్నారు. తాను చూస్తున్న శాఖ అత్యంత కీలకమైనది కావటంతో ఇదే అదనుగా ఆయన తన కొడుకులతో కలిసి వ్యవహారాలు పెద్ద ఎత్తున చక్కబెడుతున్నారు అనే ప్రచారం ప్రభుత్వ వర్గాల్లో జోరుగా సాగుతోంది.