అసలు నందమూరి బాలకృష్ణ కోపం ఎవరి మీద?. ఆయన శుక్రవారం నాడు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలో ఏమి చెపుదామనుకుని ఏమి చెప్పారు?. ఇదే ఇప్పుడు టీడీపీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన అంశం. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తీరుపై బాలకృష్ణ ఎప్పటి నుంచో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అని ఆ పార్టీ నాయకులే చెపుతున్నారు. ఎన్నికలకు ముందు కూడా ఆయనకు టీడీపీ పొలిట్ బ్యూరోలో చోటు కల్పించగా అందరికి ఇచ్చే పదవి తనకు ఎందుకు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు అప్పటిలోనే వార్తలు వచ్చాయి. తర్వాత ఆయన ఎన్నో సార్లు ఈ మీటింగ్ లకు డుమ్మా కూడా కొట్టారు. కారణాలు ఏమైనా మంత్రి పదవి ఇవ్వటం లేదు. పార్టీ లో అయినా కీలక పదవి ఇవ్వాలి కదా అన్నది బాలకృష్ణ అభిమతంగా ఆయన సన్నిహితులు చెపుతున్న మాట. తన అసంతృప్తిని బహిర్గతం చేసేందుకు బాలకృష్ణ ఇలా వ్యవహరించారా అన్న అనుమానం కూడా పార్టీ నేతల్లో లేకపోలేదు. కాకపోతే అసెంబ్లీ వేదికగా బాలకృష్ణ వ్యవహరించిన తీరుపై పార్టీ నేతలు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అసెంబ్లీ అన్న తర్వాత కొన్ని పద్ధతులు...సంప్రదాయాలు ఉంటాయి. కానీ ఆయన శుక్రవారం నాడు సభలో మాట్లాడే సమయంలో రెండు చేతులు జేబుల్లో పెట్టుకుని ఏదో బయట ప్రైవేట్ కార్యక్రమంలో మాట్లాడినట్లు మాట్లాడారు అని...ఇది ఏ మాత్రం మంచి పద్ధతి కాదు అని టీడీపీ నేతలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రిని కలవటానికి కూడా ఎఫ్ డీసి ఒక జాబితా తయారు చేస్తే అందులో కూడా తన పేరు తొమ్మిదో నంబర్ లో రాశారు అని...ఈ జాబితా తయారు చేసింది ఎవరు అని మంత్రి కందుల దుర్గేష్ ను అడిగినట్లు అసెంబ్లీ లోనే బాలకృష్ణ చెప్పారు. ఇదేనా వ్యక్తులకు ఇచ్చే గౌరవం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మాటలను బట్టి ఈ ప్రభుత్వ తీరుపై బాలకృష్ణ ఆగ్రహంగా ఉన్నారనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని సైకో అంటూ బాలకృష్ణ సభలో ఆయన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో..మీడియా సమావేశాల్లో కూడా ఇదే మాట ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నో సార్లు వాడారు. సినిమా ప్రముఖులను గతం లో జగన్ మోహన్ రెడ్డి అవమానించారు అనే అంశంపై బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అసెంబ్లీలో మాట్లాడిన వాటికి కౌంటర్ ఇస్తూ చిరంజీవి గట్టిగా మాట్లాడం వల్ల ఏమి జగన్ వాళ్ళతో సమావేశం కాలేదు అని...అక్కడ ఎవడూ గట్టిగా మాట్లాడలేదు అంటూ బాలకృష్ణ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.
దీనిపై చిరంజీవి వెంటనే ప్రకటన విడుదల చేయటంతో ఇది పెద్ద వివాదంగా మారింది. చిరంజీవి ఇందులో జగన్ తమను ఎక్కడా అవమానించలేదు అని..ఎంతో గౌరవంగా చూసుకున్నారు అని చెప్పారు. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే చిరంజీవి సోదరుడు...ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ టికెట్ రేట్ల పెంపు విషయంలో ప్రాధేయపడాల్సిన అవసరం లేదు అని చిరంజీవి లాంటి వాళ్లకు కూడా చెప్పండి అని అప్పటిలో ఒక మీటింగ్ లో ఆన్ రికార్డు చెప్పారు. మా కుటుంబంలోని వ్యక్తి చేతులు జోడించి నమస్కారం పెడితే కూడా ప్రతినమస్కారం పెట్టలేదు అని పవన్ విమర్శలు గుప్పించారు అప్పటిలో. ఇప్పుడు చిరంజీవి అందుకు భిన్నంగా స్పందించటం కూడా హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికి శుక్రవారం నాడు అసెంబ్లీ వేదికగా చేసిన కామెంట్స్ అధికార టీడీపీ ని ఇరకాటంలోకి నెట్టాయి.