ఫస్ట్ టైం ఫాన్స్ నుంచి డిమాండ్

Update: 2025-10-13 12:48 GMT

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం. ఇది సోమవారం నాడు హిందూపూర్ నియోజకవర్గంలో జరిగింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలని ఆయన అభిమానులు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాలకృష్ణను మంత్రి వర్గంలోకి తీసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేశారు. అభిమానుల డిమాండ్ పై నందమూరి బాలకృష్ణ కూడా స్పందించారు. అవసరం అయినప్పుడు మంత్రి పదవి వస్తుంది. ఓపిక పట్టండి అని ఆయన తన అభిమానులకు చెప్పుకొచ్చారు. ఇది ఏపీ రాజకీయాల్లో అత్యంత కీలక పరిణామం అనే చెప్పాలి. ఎందుకంటే నందమూరి బాలకృష్ణ ఎప్పటి నుంచో పార్టీ లో తనకు సరైన పదవి ఇవ్వటంలేదు అనే అసంతృప్తి ఉన్నట్లు ఆ పార్టీ నేతలే చెపుతున్నారు. గతంలో పొలిట్ బ్యూరో పదవి ఇచ్చినప్పుడు కూడా అంతమందిలో తనను కూడా గుంపులో గోవిందయ్యలా చేయటం ఏమిటి అని వ్యాఖ్యానించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవల అసెంబ్లీ మాట్లాడిన సమయంలో కూడా ఈ ప్రభుత్వంలో కూడా తనకు సరైన గౌరవం దక్కటం లేదు అన్న విషయాన్ని ఆయన ఏ మాత్రం మొహమాటం లేకుండానే అసెంబ్లీ వేదికగా చెప్పారు. ఇప్పుడు కొత్తగా బాలకృష్ణకు మంత్రి పదవి డిమాండ్ తెరమీదకు రావటం ప్రాధాన్యత సంతరించుకుంది అనే చెప్పాలి. బాలకృష్ణ అభిమానులు కోరుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంత ఈజీ గా బాలకృష్ణ మంత్రి పదవి ఇస్తారా అంటే కచ్చితంగా సందేహమే అనే చర్చ సాగుతోంది.

                                      చంద్రబాబు సీఎం గా ఉంటే, ఆయన తనయుడు, బాలకృష్ణ అల్లుడు అయిన నారా లోకేష్ ఏపీ ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్నారు. ఈ చంద్రబాబు వర్కింగ్ స్టైల్ తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా బాలకృష్ణను మంత్రి వర్గంలోకి తీసుకుంటారు అని అనుకోరు అని ఒక సీనియర్ నేత అబిప్రయపడ్డారు. అయితే మంత్రి పదవి డిమాండ్ చేస్తే పార్టీ లో అయినా కీలక పదవి దక్కే ఛాన్స్ లేకపోలేదు అనే అంచనాలు ఉన్నాయి. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు అయిన ఎన్టీఆర్ తనయుడిగా నందమూరి బాలకృష్ణ ఒక్క సారి అయినా మంత్రి పదవి చేపట్టాలనే డిమాండ్ ఆయన అభిమానుల్లో ఉంది. అయితే చంద్రబాబు రాజకీయ లెక్కలు ఎలా ఉంటాయో అందరికి తెలిసిందే. ఏది ఏమైనా కొత్తగా బాలకృష్ణను మంత్రి పదవి ఇవ్వాలనే డిమాండ్ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఎన్ని సంచలనాలకు కారణం అవుతుందో చూడాలి.

Tags:    

Similar News