ఏ బీ వెంకటేశ్వరరావుపై మరోసారి క్రమశిక్షణా చర్యలు

Update: 2021-04-18 16:11 GMT

సస్పెన్షన్ లో ఉన్న సీనియర్ పోలీసు అధికారి ఏ బీ వెంకటేశ్వరరావుపై సర్కారు మరోసారి చర్యలకు రంగం సిద్ధం చేసింది. ఇటీవల కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారుపై విమర్శలు చేయటంతో పాటు తాజాగా వైఎస్ వివేకా హత్య కేసులో తాను వివరాలు ఇస్తానన్న సీబీఐ విచారణా అధికారులు అందుకు సమ్మతించలేదంటూ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ రెండు చర్యలు సర్వీస్ రూల్స్ కు విరుద్ధంగా ఉన్నాయని, నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆయనపై ఆర్టికల్ ఆఫ్ చార్జెస్ నమోదు చేసింది.

ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఆదివారం నాడు జీవో జారీ చేశారు. నిఘా పరికరాల కొనుగోళ్లల్లో అవకతవకల అభియోగంపై ఇప్పటికే ఏబీవీ సస్పెన్షన్‌లో ఉన్నారు. ఇప్పుడు సర్వీస్ రూల్సుకు వ్యతిరేకంగా వ్యవహరించారని మరోసారి ఏబీ వెంకటేశ్వరరావుపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ పరిణామాలపై ఏ బీ వెంకటేశ్వరరావు ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే. తనను కేసులో ఇరికించేందుకు ఏకంగా డీజీపీతోపాటు మరి కొంత మంది అధికారులు ఫోర్జరీకి పాల్పడ్డారంటూ ఏ బీ వెంకటేశ్వరరావు సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News