హాట్ టాపిక్ గా చంద్రబాబు నిర్ణయం

Update: 2024-08-29 08:42 GMT

తెలుగు దేశం అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంతి చంద్రబాబు నాయుడికి ఇకప్పుడు సీఈఓ అనే ఇమేజ్ ఉండేది. ఆయన తనను సీఎం గా కంటే సీఈఓగా పిలిపించుకోవటానికే ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇది అంతా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి పరిస్థితి. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ కు హైదరాబాద్ వంటి నగరం లేకపోవటం...ఏపీలో ఐటి రంగం ఉనికి నామమాత్రం కావటంతో ఆ ఇమేజ్ పోయింది..వదులుకోవాల్సి వచ్చింది అనే చెప్పాలి. ఇప్పుడు విభజన తర్వాత రెండవసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు మరో సారి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ముఖ్యంగా ఆయన తన క్యాబినెట్ లోని మంత్రులు అందరి దగ్గర ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ ను పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి బుధవారం నాడు చంద్రబాబు అద్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశం కూడా ఆమోదం తెలిపింది. సహజంగా ఎప్పుడైనా మంత్రుల దగ్గర పీఎస్ లేదా ఓఎస్డీ లు ఉంటారు. ఐఏఎస్ ల విషయానికి వస్తే ఆయా శాఖల్లో ముఖ్యకారదర్శి/కార్యదర్శి ఉంటారు. పాలన అంతా ఆ ప్రభుత్వ విధానం ప్రకారం..క్యాబినెట్ నిర్ణయాల ప్రకారం ముందుకు సాగుతుంది మరి ఇప్పుడు ప్రతి మంత్రి దగ్గర కొత్తగా పెట్టే ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ ఏమి చేస్తారు.

                                                 పాలనపై ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ చూపించే ప్రభావం ఏమైనా ఉంటుందా?. విధాన నిర్ణయాలు తీసుకోవాల్సింది..ప్రభుత్వం..క్యాబినెట్.అలాంటప్పుడు ప్రతి మంత్రి దగ్గర వీళ్ళను పెట్టడం అంటే దీని వెనక ఉన్న కారణం ఏంటి?. వీళ్ళను మంత్రులపై నిఘాకు చంద్రబాబు ఉపయోగిస్తారా? అన్న అనుమానాలు టీడీపీ నేతలతో పాటు జనసేన నాయకుల్లో కూడా ఉంది. ఇప్పుడు ఏపీలో ఉన్నది కూటమి ప్రభుత్వం. టీడీపీ తో పాటు జనసేన, బీజేపీ నుంచి కూడా క్యాబినెట్ లో మంత్రులు ఉన్న విషయం తెలిసిందే. రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం విధాన నిర్ణయాలు తీసుకోవటానికి అవసరమైన నివేదికలు సిద్ధం చేయటం...నిపుణులైన ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ తో కమిటీ వేసి ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వమని కోరితే అది కొంత అర్ధవంతంగా ఉంటుంది కానీ..ఇలా ప్రతి మంత్రి దగ్గర ఒక ఎంబీఏ గ్రాడ్యుయేట్ ను పెట్టడం వల్ల ప్రభుత్వం అదనపు భారం తప్ప మరొకటి ఉండదు అని ఒక ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు. లేదు అంటే పార్టీ నాయకుల్లో ప్రచారం జరుగుతున్నట్లు రాజకీయ కోణంలోనే వీళ్ళను తెరపైకి తెచ్చి ఉండొచ్చు అని ఆయన సందేహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News