
ఆంధ్ర ప్రదేశ్ లోని వందల ఎకరాల వక్ఫ్ భూములు ప్రైవేట్ వ్యక్తులు..కార్పొరేట్ కంపెనీల చేతుల్లోకి వెళ్ళబోతున్నాయి. దేశం అంతా వక్ఫ్ సవరణ బిల్లు పై చర్చ సాగుతున్న వేళ ఆంధ్ర ప్రదేశ్ వక్ఫ్ బోర్డు జారీ చేసిన నోటిఫికేషన్ చాలా మందిని షాక్ కు గురి చేసింది. ముఖ్యంగా ఈ టైమింగ్ అన్నది అత్యంత కీలకంగా మారింది. విపక్షాల ఆందోళనల మధ్య కేంద్రం అటు లోక్ సభలో..ఇటు రాజ్య సభలో వక్ఫ్ సవరణ బిల్లును ఆమోదింప చేసుకుంది. ఇక రాష్ట్రపతి ఆమోదమే తరువాయి ఇది అమలులోకి రానుంది. కేంద్రంలోని ఎన్డీయే సర్కారులో భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జనసేన లు కూడా ఈ బిల్లుకు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఒక వైపు పార్లమెంట్ లో ఈ వక్ఫ్ చట్ట సవరణ జరుగుతున్న వేళ ఆంధ్ర ప్రదేశ్ వక్ఫ్ బోర్డు తమ అధీనంలో ఉన్న వక్ఫ్ ఆస్తులను అభివృద్ధి చేసేందుకు ప్రైవేట్ కంపెనీలను ఆహ్వానిస్తూ ఆసక్తి వ్యక్తీకరణ ( ఈఓఐ) నోటిఫికేషన్ జారీ చేసింది. దేశీయ, అంతర్జాతీయ సంస్థలు తమ ఆసక్తిని తెలుపవచ్చు అని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వక్ఫ్ బోర్డు ఆస్తులను దీర్ఘకాలిక లీజ్ ప్రాదిపదికన లేదా పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ (పీపీపీ) విధానంలో అభివృద్ధి చేయటానికి అవకాశం ఉంది అని ఆప్షన్ ఇచ్చారు. రాష్ట్రంలో వక్ఫ్ భూములు ఎకరం నుంచి రెండు వందల ఎకరాల వరకు ఉన్నాయని తెలిపారు.
కమర్షియల్ డెవలప్మెంట్ తో పాటు ఇతర రంగాలు అయిన సోలార్ ఎనర్జీ పార్క్స్, ఇండస్ట్రియల్ వెంచర్స్, విద్య సంస్థలు, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ కు ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని నోటిఫికేషన్ లో వెల్లడించారు. ఆసక్తి ఉన్న సంస్థలు మే 8 వ తేదీ నాటికి తమ ఆసక్తిని తెలియచేయాల్సి ఉంటుంది. ఈ సంస్థలు తమ కంపెనీ ప్రొఫైల్ తో పాటు గతంలో చేసిన ప్రాజెక్ట్ ల వివరాలు అందివ్వాల్సి ఉంటుంది అని నోటిఫికేషన్ లో స్పష్టం చేశారు. వీటితో పాటు గత ఐదు సంవత్సరాల కాలంలో కంపెనీ టర్నోవర్..ఫైనాన్సియల్ స్టేట్మెంట్స్ కు సమర్పించాలి. అర్హత ఉన్న ఈఓఐ లను ఎంపిక చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ అయిన కంపెనీలు వక్ఫ్ బోర్డు ఆయా కంపెనీలతో పంచుకున్న భూముల వివరాలను బహిర్గతం చేయం అనే నాన్ డిస్ క్లోజర్ అగ్రిమెంట్ (ఎన్ డీఏ ) చేయాల్సి ఉంటుంది. వక్ఫ్ బోర్డు భూముల ను డెవలప్ మెంట్ తో పాటు పీపీపీ మోడల్ లో అప్పగించాలి అని నిర్ణయించారు అంటేనే ఇందులో బిగ్ స్కెచ్ ఉండి ఉంటుంది అనే చర్చ అధికార వర్గాల్లో సాగుతోంది.
పైగా ఇవి సోలార్ ఎనర్జీ పార్క్స్ వంటి వాటికీ ఉపయోగపడతాయి అని నోటిఫికేషన్ లో చెప్పారంటే ముందే వీటికి సంబంధించి పనులు చేసుకున్నట్లు ఉంది అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిజంగా వక్ఫ్ బోర్డు కు ఎక్కువ ఆదాయం వచ్చేలా చూడాలి అంటే ల్యాండ్ పార్సెల్స్ ఎక్కడ ఎక్కడ ఉన్నాయో బహిరంగం చేసి ఓపెన్ టెండర్లు లు పిలవాలి కానీ...భూముల వివరాలను బహిర్గతం చేయకూడదు అనే ఎన్ డీఏ షరతు పెట్టారు అంటేనే ఇందులో ఏదో మతలబు ఉంది అనే చర్చ అధికార వర్గాల్లో సాగుతోంది. చూడాలి మే తర్వాత ఆంధ్ర ప్రదేశ్ లోని వక్ఫ్ భూములు ఏ ప్రైవేట్ వ్యక్తులు..ఏ బడా కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళతాయో.