గుజరాత్ కు ఏపీ పాడి పరిశ్రమను అప్పగించే కుట్ర
ప్రజల సొమ్ముతో ఏపీ అమూల్ బేబీ దోపిడీ
తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బుధవారం నాడు విజయవాడలో ఆ పార్టీ సీనియర్ నేత, సంగం డెయిరీ ఛైర్మన్ దూళిపాళ నరేంద్రను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం నేతలను అన్ని రకాలుగా వేధించటంతోపాటు చివరకు సొంత పార్టీ ఎంపీని కూడా అరెస్ట్ చేసి కొట్టించారని విమర్శించారు. 'భారతదేశంలో మనం అమూల్ బేబీని చూశాం. కానీ ఆంధ్ర రాష్ట్రంలో కొత్త అమూల్ బేబీ జగన్మోహన్ రెడ్డిని చూస్తున్నాం. దశాబ్దాలుగా పాడి పరిశ్రమను అభివృద్ధి చేసి.. ఈ రంగాన్ని ప్రోత్సహించింది సంగం డెయిరీ. ఇప్పుడు దీన్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ధూళిపాళ నరేంద్ర చేసిన తప్పేంటి అని ప్రశ్నిస్తున్నా. లీటర్ కు రైతులకు అదనంగా నాలుగు రూపాయలు ఇవ్వటం తప్పా? . ఆస్పత్రి కట్టి 50 శాతం రాయితీతో రైతులకు వైద్య సేవలు అందించటం ఆయన చేసిన తప్పా?.
2013లో సంగం డెయిరీ మ్యాక్స్ సొసైటీ నుంచి కంపెనీకి మారిందనే విషయం అందరికీ తెలిసిందే. కావాలని ఎప్పుడో జరిగిన విషయాన్ని తీసుకొచ్చి ఎవరైతే ప్రజల తరపున పోరాడుతున్నారో వాళ్ళను ఇబ్బంది పెడుతున్న తీరు మనందరం చూస్తున్నాం. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగింది జరిగింది అని ఆరు సంవత్సరాలుగా చెబుతూ వస్తున్నారు. అది జరగగలేదని స్టింగ్ ఆపరేషన్ చేయటం తప్పా?. ప్రజల కోసం నిరంతరం పోరాడిన వ్యక్తి నరేంద్ర. ఐదుసార్లు ఎమ్మెల్యే నెగ్గారు. సంగం డెయిరీని దెబ్బతీయాలనుకోవటం వెనక చాలా పెద్ద కుట్ర ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో పాడి పరిశ్రమను మొత్తం గుజరాత్ కు అమ్మేద్దామని ప్రయత్నిస్తున్నారు. ఇందులో జగన్ రెడ్డి వాటా ఎంతో చెప్పాలి. ఒంగోలు డైయిరీని అమూల్ కు అప్పగించారు. దానికి వందల కోట్ల ఆష్తుల ఉన్నాయి. అవి అన్నీ అమూల్ కు అప్పగించారు. అది కూడా నిబంధనల ప్రకారం జరగలేదు. అమూల్ డెయిరీ కోసం ఈ అమూల్ బేబీ 3000 కోట్ల రూపాయల లోన్ తీసుకుని వాళ్ళకు సౌకర్యాలు కట్టిస్తాడుంట..ఈ డబ్బు ఎవరు కట్టాల. తిరిగి ఏపీ ప్రజలు కట్టాలి. ప్రజల సొమ్ముతో ఈ అమూల్ బేబీ దోపిడీ చేస్తున్నాడు.' అని ఆరోపించారు.