ఐఏఎస్ ల సంఘం ప్రెస్ మీట్..అవాక్కు అవుతున్న అధికారులు!

Update: 2023-02-10 11:33 GMT

ఆంధ్ర ప్రదేశ్ ఐఏఎస్ ల సంఘం గురువారం నాడు పెట్టిన మీడియా సమావేశం చూసి సహచర ఐఏఎస్ లు కూడా అవాక్కు అవుతున్నారు. ఆంధ్ర ప్రదేశ్ సిఎస్ జవహర్ రెడ్డి పై ఇటీవల మీడియాలో కొన్ని వార్తలు వచ్చాయి. మాజీ ఎంపీ వై ఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కు సంబంధించి సిబిఐ అధికారులు ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి, సీఎం నివాసం లో పని చేసే నవీన్ లను విచారించారు. వాళ్ళ దగ్గర సమాచారం తీసుకున్నారు. ఇది జరిగిన రోజే సిఎస్ జవహర్ రెడ్డి కూడా కడప జిల్లా లో పర్యటించారు. సీఎస్ పర్యటన ముగిశాక...కృష్ణ మోహన్ రెడ్డి, నవీన్ లను జవహర్ రెడ్డి తన కార్ లో విజయవాడ తీసుకొచ్చారని రెండు పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఈ వార్తలు పెద్ద కలకలం రేపగా తర్వాత సిఎస్ జవహర్ రెడ్డి ఖండన ఇచ్చారు...ఆ వార్తలు పూర్తిగా తప్పు అని తెలిపారు. ఆ ఖండన కూడా మీడియాలో వచ్చింది. వార్త రావటం..దానికి స్వయంగా జవహర్ రెడ్డి ఖండన ఇవ్వటం..అది కూడా క్యారీ అయింది. నిజంగా ఏ పత్రిక అయినా తప్పుడు వార్తలు రాస్తే కేసు లు పెట్టొచ్చు...చర్యలు తీసుకోవచ్చు. చాలాసార్లు పరువు నష్టం దావాలు కూడా వేస్తారు.

సిఎస్ విషయంలో అంతా జరిగిపోయిన తర్వాత ఇంత తాపీగా అసలు ఐఏఎస్ ల సంఘం ఎందుకు స్పందించింది... ఇందులో అసలు సంఘం స్పందించాల్సిన అవసరం ఉందా అని కొంత మంది ఐఏఎస్ లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆరవ తేదీన సమావేశం అయితే ఈ విషయం చెప్పటానికి తొమ్మిదవ తేదీ వరకు ఎందుకు పట్టింది. ఒక్క ఫోన్ కాల్ తో సమాచారం వచ్చే రోజుల్లో ఎంతో పవర్ ఫుల్ గా ఉండే ఐఏఎస్ ల సంఘం ఈ విషయాన్నీ నిర్దారించుకోవటానికి ఇంత సమయం పట్టిందా...స్వయం గా సిఎస్ ఖండన ఇచ్చిన తర్వాతా కూడా వీళ్లు ఇంత సమయం ఎందుకు తీసుకున్నారు అంటే పై నుంచి వచ్చిన ఒత్తిడి మేరకే వీళ్లు మీడియా ముందుకు వచ్చారని కొంత మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘం తరపున ఐఏఎస్ లు ప్రవీణ్ కుమార్, శశి భూషణ్, నివాస్, రంజిత్ బాషా తదితరులు మీడియా ముందుకు వచ్చారు. అసలు వార్త కంటే ఐఏఎస్ ల సంఘం వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 

Tags:    

Similar News