పంచాయతీ ఎన్నికలు... తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు

Update: 2021-01-19 09:52 GMT

ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ అంశంపై హైకోర్టులో ఇరు పక్షాల వాదనలు ముగిశాయి. ఎలాగైనా ఎన్నికలు పెట్టాలనే పట్టుదలతో ఎస్ఈసీ ఉండగా, వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయినందున ఇప్పుడు ఎన్నికలు జరపటం సాధ్యంకాదని ప్రభుత్వం చెబుతోంది. మంగళవారం నాడు కూడా ఈ అంశంపై వాదనలు విన్న హైకోర్టు సీజే జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేసింది. ఉపాధ్యాయులు, ఉద్యోగుల తరఫున దాఖలైన ఇంప్లీడ్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక అందులో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) తరఫున సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు సోమవారం నాడు హైకోర్టులో వాదనలు వినిపించారు.

పంచాయతీ ఎన్నికలను నిలిపివేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌(ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ... కరోనా వ్యాక్సిన్‌ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన వివరాల్ని ఎస్‌ఈసీ పరిగణనలోకి తీసుకోలేదన్నారు. ఓవైపు వ్యాక్సిన్ కార్యక్రమం, మరోవైపు ఎన్నికల నిర్వహణ కష్టమన్నారు. ఏజీ వాదనలకు ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది బదులిచ్చేందుకు విచారణ మంగళవారానికి వాయిదా పడింది. ఇవాళ ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు విన్న అనంతరం ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేసింది. దీంతో ఈ అంశంపై సస్పెన్స్ ఎప్పుడు వీడుతుందో వేచిచూడాల్సిందే. రాజకీయంగా కూడా ఈ అంశం ఏపీలో అత్యంత కీలకంగా మారింది.

Tags:    

Similar News