తిరుప‌తిలో అమ‌రావ‌తి రైతుల స‌భ‌కు హైకోర్టు ఓకే

Update: 2021-12-15 11:40 GMT

న్యాయ‌స్థానం టూ దేవ‌స్థానం పేరుతో పాద‌యాత్ర చేసిన అమ‌రావ‌తి రైతుల‌కు ఊర‌ట‌. అమ‌రావ‌తి ఏకైక రాజధానిగా ఉండాలంటూ రైతులు త‌ల‌పెట్టిన పాద‌యాత్ర ముగిసింది. చివ‌రిగా తిరుప‌తిలో బ‌హిరంగ స‌భ త‌ల‌పెట్టారు. అయితే ఈ స‌భ‌కు జిల్లా యంత్రాంగం అనుమ‌తి ఇవ్వ‌లేదు. దీంతో అమ‌రావ‌తి రైతులు ఏపీ హైకోర్టును ఆశ్ర‌యించ‌గా..బుధ‌వారం నాడు హైకోర్టు ప‌లు ప‌రిమితుల‌తో తిరుప‌తిలో బ‌హిరంగ స‌భ నిర్వ‌హించుకునేందుకు అనుమ‌తి మంజూరు చేసింది. ఈ నెల‌17న అంటే శుక్రవారం నాడు స‌భ మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల నుంచి సాయంత్రం ఆరు గంట‌ల వ‌ర‌కూ జ‌రుపుకోవాల‌న్నారు.

కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ..ఎలాంటి రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేయ‌కుండా సంయ‌మ‌నం పాటించాల‌ని కోర్టు సూచించింది. అయితే ప్ర‌భుత్వం త‌ర‌పున వాద‌న‌లు విన్పించిన వారు మాత్రం స‌భ‌కు అనుమ‌తి ఇవ్వ‌టంపై అభ్యంత‌రాలు వ్య‌క్తం చేశారు. రాయ‌ల‌సీమ‌కు చెందిన కొంత మంది వ్య‌క్తులు ఉద్య‌మం జ‌రుపుతున్నందున ఈ త‌రుణంలో తిరుప‌తిలో అమ‌రావ‌తి రైతుల స‌భ‌కు అనుమ‌తి ఇవ్వ‌టం వ‌ల్ల స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని కోర్టుకు నివేదించారు. అయితే హైకోర్టు ష‌రతుల‌తో స‌భ‌కు అనుమ‌తి ఇచ్చింది. దీంతో రైతుల పాద‌యాత్ర సంపూర్ణం కానుంది.

Tags:    

Similar News