రహేజా రియల్ ఎస్టేట్ కు 27 ఎకరాలు 99 పైసలకే

Update: 2025-11-13 06:21 GMT

ఉద్యోగాల విషయంలో జీఓలోనే గందరగోళం

వెయ్యి కోట్ల రూపాయల భూమి ..99 పైసలకా?!

క్యాబినెట్ ఆమోదం సరే...హేతుబద్దత అక్కరలేదా?!

ఒక వైపు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం రోజురోజుకు అప్పుల ఊబిలోకి కురుకుపోతోంది. మరో వైపు రాష్ట్రానికి చెందిన వందల...వేల కోట్ల రూపాయల సంపదను కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..అయన తనయుడు, మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంతి పవన్ కళ్యాణ్ లు. క్యాబినెట్ సాక్షిగా ఈ అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటున్నా కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చోద్యం చూస్తున్నారు తప్ప నోరు తెరిచి మాట్లాడం లేదు. ఐటి రంగం అభివృద్ధి, ఉద్యోగ అవకాశాల కల్పన కోసం దిగ్గజ సంస్థలకు రాయితీ రేట్లతో భూములు ఇస్తే పెద్దగా తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కానీ పక్కా రియల్ ఎస్టేట్ సంస్థలకు...పూర్తిగా వ్యాపార కోణంలో వ్యవహరించే సంస్థలకు వందల కోట్ల రూపాయల విలువైన భూములను ఒక్క టీ కంటే తక్కువ ధరకే కట్టబెడుతుండటం చూసి అవాక్కు అవటం ప్రజల వంతు అవుతోంది. క్యాబినెట్ లో పెట్టి నిర్ణయం తీసుకున్నా...విధానపరంగా నిర్ణయం తీసుకున్నా దేనికైనా ఒక హేతుబద్దత ఉండాలి. కానీ ఇక్కడ మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు కలిసి తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రం ప్రైవేట్ సంస్థలకు మేలు చేసి పెట్టి పెద్ద ఎత్తున తెర వెనక లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

                                         లేక పోతే ఏ మాత్రం బాధ్యత ఉన్నా ఇలాంటి నిర్ణయాలు తీసుకోరు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి అభిప్రాయపడ్డారు. ఇదే ప్రభుత్వం కొద్ది నెలల క్రితమే వైజాగ్ లో సత్వా రియల్ ఎస్టేట్ సంస్థ కు ఐటి స్పేస్ తో పాటు రెసిడెన్సియల్ స్పేస్ డెవలప్మెంట్ కోసం అని ఎకరా కోటిన్నర లెక్కన మధురవాడ ఐటి హిల్ లో 30 ఎకరాలు కేటాయించింది. ఇప్పుడు మధురవాడ లోని ఐటి హిల్ నంబర్ మూడు లో రహేజా కార్ప్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ కు 99 పైసలకే 27 .10 ఎకరాలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కంపెనీ 2172 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతుంది అని...9681 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది అని పేర్కొన్నారు. ఇక్కడ ఎకరా ధర తక్కువలో తక్కువ 40 కోట్ల రూపాయలు ఉంటుంది. అంటే ప్రభుత్వం 1080 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని కేవలం 99 పైసలకు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి కట్టబెట్టింది. ఇందులో రహేజా ఐటి స్పేస్ తో పాటు రెసిడెన్సియల్ స్పేస్ కూడా డెవలప్ చేసుకోవచ్చు. ఇంత కారు చౌకగా భూమి ఇవ్వటం చాలదన్నట్లు ప్రభుత్వమే 91 కోట్ల రూపాయలకు పైగా ఖర్చుపెట్టి రోడ్లు..విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు కూడా ఈ సంస్థకు కలిపించటానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

                                      వీటితో పాటు ఐటి , జీసీసీ పాలసీ ప్రకారం వచ్చే అన్ని రాయితీలు కూడా ఈ సంస్థకు వర్తిస్తాయి అని జీవోలో స్పష్టం చేశారు. కంపెనీ పెట్టే పెట్టుబడితో 9681 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంది అని చెప్పి...15000 వేల ఉద్యోగాలు కల్పిస్తుంది అనే హామీతోనే ఈ భూమిని కేటాయించటానికి ఎస్ఐపీబి సిఫారసు చేసినట్లు జీవోల్లో పేర్కొన్నారు. అసలు ఉన్న స్కోప్ కేవలం 9681 ఉద్యోగాలు అని చెప్పి....ఎస్ఐపీబి లో మాత్రం 15000 ఉద్యోగాల హామీతో 99 పైసలకు 27 ఎకరాల భూమి కేటాయించటానికి సిఫారసు చేశారు. అంటే ఈ లెక్కలు ఎంత కామెడీ గా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఒక్క రహేజా అనే కాకుండా ప్రభుత్వం నుంచి భూములు తీసుకునే కంపెనీలు కల్పించే ఉద్యోగాల విషయంలో అసలు లెక్కలు చూసే మెకానిజమే ప్రభుత్వం దగ్గర లేదు. వాళ్ళు చెప్పే లెక్కలు రాసుకోవటం తప్ప ...వీటిని చూసే పరిస్థితి ప్రభుత్వంలో ఉండదు అనే చెప్పాలి. అసలు నిజంగా ప్రైవేట్ కంపెనీలకు వాటి అవసరాలకు అనుగుణంగా భూములు కేటాయిస్తున్నారా ...లేక వాళ్ళు కోరినంత కేటాయించుకుంటూ పోతున్నారా అంటే ఎక్కువ శాతం కంపెనీలు కోరినట్లే ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఎందుకంటే ఇందులో రాష్ట్ర ప్రయోజనాల కంటే ఎవరి ప్రయోజనాలు వాళ్ళవి.

Tags:    

Similar News