విమాన ప్రయాణికులు సరిపడనంత మంది లేకపోయితే విమానయాన సంస్థలు ఆయా రూట్లలో సర్వీసులు నడపవు. ఎందుకంటే అది వాళ్లకు లాభదాయకం కాదు కాబట్టి. ఏపీలోని కడప, కర్నూలు విమానాశ్రయాల నుంచి కూడా సరిపడినంత ట్రాఫిక్ ఉండదు. అందుకే ఇక్కడ నుంచి సర్వీసులు నడిపేందుకు ఎయిర్ లైన్స్ ఆసక్తిచూపటం లేదు. ఈ రెండు ప్రాంతాల నుంచి విమాన సర్వీసులు నడిపేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఇండిగో ఎయిర్ లైన్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది. దీని కోసం ఏటా 20 కోట్ల రూపాయలు చెల్లించనుంది. ఈ మేరకు శుక్రవారం నాడు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేశారు.
కడప నుంచి విజజయవాడకు, చెన్నయ్ కు, కర్నూలు-విజయవాడతో పాటు ఇతర ప్రాంతాలకు ఇండిగో సర్వీసులు నడుపుతుందని ఏపీ మంత్రి పేర్ని నాని తెలిపారు. గతంలో ట్రూజెట్ ఎయిర్ లైన్స్ సర్వీసులు నడిపేదని..ఇప్పుడు ఆ సంస్థ వెనక్కు తగ్గటంతో అదే తరహాలో ఇండిగోతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. వారానికి 4 సర్వీసులు నడిపేలా ఇండిగో ఎయిర్‌లైన్స్‌తో ఒప్పందానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇప్పటికే రెడీ అయిన విమానాశ్రయాలకే ప్రభుత్వం డబ్బులు ఎదురుఇచ్చి సర్వీసులను నడపాల్సి వస్తోంది. కానీ సీఎం జగన్ మాత్రం తాజాగా జిల్లాకు ఏ విమానాశ్రయం కట్టాలని...అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అదికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం కూడా సర్వీసులు నడిపినందుకు రాయితీలు ఇచ్చింది.