మందు బాబులకు షాక్ ఇచ్చేందుకే రేట్ల పెంపు. రేట్ల పెంపు ద్వారా మద్యం విక్రయాలు తగ్గిపోతాయి. ఇదీ మద్యం రేట్ల పెంపుపై వైసీపీ సర్కారు గతంలో చేసిన వాదన. అంతే కాదు...ఎక్కడాలేని రకరకాల కొత్త బ్రాండ్లను తీసుకొచ్చి ఏపీ సర్కారు భారీ ధరలు పెట్టి మరీ మందుబాబులకు షాక్ ఇచ్చింది. సరే సర్కారు లాజికే కరెక్ట్ అనుకుందాం. మందుబాబులకు షాక్ ఇచ్చేందుకు..మద్యం వాడకందారులను నిరుత్సాహపర్చేందుకు ధరలను పెంచిన సర్కారు మరి ఇప్పుడు ధరల తగ్గింపు నిర్ణయం ఎందుకు తీసుకున్నట్లు. సర్కారు చెప్పిన దాని ప్రకారం చూస్తే ధరలు ఎక్కువ చేస్తే మద్యం వినియోగం తగ్గుతుందని..మరి ఇప్పుడు ధరలు తగ్గించటం వల్ల వినియోగం పెరుగుతుంది కదా. ఏపీ సీఎం జగన్ చెప్పింది తాము అధికారంలోకి వస్తే దశలవారీగా మద్య నిషేధం అమలు చేస్తామని ప్రకటించారు. కానీ ఏపీలో జరుగుతున్నది అందుకు భిన్నంగా ఉంది. ప్రభుత్వం రేట్ల పెంపు వల్ల విక్రయాలు భారీగా తగ్గినట్లు చెబుతున్నా...కొత్త కొత్త బ్రాండ్లతో ధరలు అడ్డగోలుగా పెంచటం వల్ల సర్కారుకు వచ్చే ఆదాయం ఏ మాత్రం తగ్గలేదన్నది ప్రతిపక్ష పార్టీల వాదన. మద్యం విక్రయాలను నిరుత్సాహపర్చేందుకు రేట్లు పెంచామని ఇంత కాలం చెప్పుకున్న సర్కారు..ఇప్పుడు పన్నుల హేతుబద్దీకరణ చేయటం ద్వారా ధరల తగ్గింపు నిర్ణయం తీసుకోవటం వెనక మతలబు ఏమిటి అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అంతే కాదు..ఇంత కాలం మందుబాబులకు పెద్దగా అందుబాటులో లేని కీలక బ్రాండ్లు కూడా అందుబాటులో ఉంచాలని ఆదేశించినట్లు సమాచారం. శనివారం నాడు సర్కారు పలు పన్నులను హేతుబద్దీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీ స్పెషల్ మార్జిన్‌లో హేతుబద్ధతను తీసుకువచ్చింది. దీని ద్వారా రాష్ట్రంలో మద్యం ధరలు తగ్గనున్నాయని పేర్కొంది. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ వెరైటీపై 5-12 శాతం మేర, మిగతా అన్ని రకాలపై 20 శాతం వరకు ధర తగ్గే అవకాశం ఉందని తెలిపింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మద్యం, నాటుసారా అరికట్టడమే లక్ష్యమని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ తెలిపారు. ఇసుక దగ్గర నుంచి మద్యం పాలసీ విషయంలోనూ సర్కారు అతి తక్కువ కాలంలోనే ఎన్నో విచిత్ర నిర్ణయాలు తీసుకుంటూ నవ్వుల పాలు అవుతోంది. అప్పుడు షాక్ అన్న సర్కారు..ఇప్పుడు కిక్కు కోసం రేట్లు తగ్గించామని చెప్పుకుంటుందేమో.