ఏపీలో గత కొన్ని రోజులుగా సినిమా టిక్కెట్ల వ్యవహారం..థియేటర్ల అంశం పెద్ద చర్చనీయాంశంగా మారాయి. గతంలో ఎన్నడూలేని రీతిలో ప్రభుత్వం సినిమా థియేటర్లపై ఉక్కుపాదం మోపింది. అయితే అందులో చాలా వరకూ అనుమతులు లేకుండా నడుస్తుంటే..మరికొన్ని ఫైర్ సేఫ్టీ వంటి సర్టిఫికెట్లను కూడా పొందలేదని తనిఖీల్లో తేల్చారు. అయితే టిక్కెట్ల వివాదం సాగుతున్న తరుణంలో ఉన్నతాధికారులు అందరూ థియేటర్ల తనిఖీలకు బయలుదేరటం..ఎక్కడక్కడ సీజ్ చేయటంతో అసలు అంశం పక్కదారి పట్టిందనే చెప్పొచ్చు. రాష్ట్రవ్యాప్తంగా అదికారులు 83 థియేటర్లను సీజ్ చేశారు. మరికొంత మంది థియేటర్ల యాజమానులు జీవో 35 ప్రకారం ప్రభుత్వం నిర్ణయించిన ధరలు తమకు ఏ మాత్రం గిట్టుబాటు కావంటూ స్వచ్చందంగా థియేటర్లను మూసివేసుకున్నారు. తాజాగా ప్రభుత్వం టిక్కెట్ల అంశాన్ని ఖరారు చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది.
ఇది త్వరలోనే ఓ కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. అయితే సర్కారు సీజ్ థియేటర్లకు సంబంధించి గురువారం నాడు ఓ కీలక వెసులుబాటు కల్పించింది. నెల రోజుల్లో అన్నిలోటుపాట్లను సవరించుకోవాలని షరతూ విధిస్తూ థియేటర్లు నడుపుకొనేందుకు అనుమతి ఇచ్చింది. అయితే థియేటర్ల యాజమాన్యాలు జాయింట్ కలెక్టర్ కు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి ఆదేశించారు. దీంతో సీజ్ చేసిన థియేటర్లు తిరిగి ఒపెన్ చేసేందుకు అనుమతి దక్కినట్లు అయింది. అయితే ఇదే పని ముందు చేసి ఉంటే ఇంత రచ్చ అయ్యేది కాదని...ప్రభుత్వం ఏదో టార్గెట్ చేసిందనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్ళాక ఇప్పుడు వెసులుబాటు ఇవ్వటం వల్ల థియేటర్ల యాజమాన్యాలకు ఓకే కానీ..ప్రభుత్వానికి జరిగిన డ్యామేజ్ మాత్రం తిరిగిరాదని ఓ వైసీపీ నాయకుడు వ్యాఖ్యానించారు.