నోటిఫికేషన్ జారీ చేసిన సివిల్ సప్లైస్ కార్పొరేషన్

Update: 2025-09-29 07:08 GMT

ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పటికే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని నిర్ణయించిన సర్కారు ఇప్పుడు మరో వివాదాస్పద నిర్ణయం దిశగా ముందుకు వెళుతోంది. రాష్ట్రంలోని రేషన్ షాప్ లు అన్నిటిని కూడా ప్రభుత్వం పెద్ద పెద్ద కంపెనీలకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసినట్లు కనిపిస్తోంది. ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఆసక్తి వ్యక్తీకరణ నోటిఫికేషన్ (ఈఓఐ) జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని ఫెయిర్ ప్రైస్ షాప్స్ అంటే అన్ని రేషన్ షాప్ లను కూడా ఆధునికీకరణ, రిటైల్ షాప్స్ తో అనుసంధానించటానికి వీలుగా ప్రైవేట్ సంస్థలు, రిటైల్ చైన్స్, ప్రభుత్వ కార్పొరేషన్స్/ఫెడరేషన్స్, ఈ కామర్స్ సంస్థలతో పాటు ఇతర ఆసక్తి ఉన్న కంపెనీలు ఏవైనా కూడా రావొచ్చు అని ప్రభుత్వం జారీ చేసిన ఈఓఐ లో పేర్కొన్నారు. అంటే రాబోయే రోజుల్లో ఆధునికీకరణ, రిటైల్ ఉత్పత్తులను కూడా ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు అని చెప్పి రాష్ట్రంలో ఉన్న రేషన్ షాప్ లు అన్నిటిని ప్రైవేట్ సంస్థలకు అప్పగించటానికి రంగం సిద్ధం చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

                                             ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలు దిగ్గజ సంస్థలు పెద్ద ఎత్తున రిటైల్ చైన్స్ తో వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అలాంటి సంస్థలకే ఈ రేషన్ షాప్ లు కూడా ఇవ్వబోతున్నట్లు ఈ నోటిఫికేషన్ చూస్తే అర్ధం అవుతోంది. ఆసక్తి ఉన్న సంస్థలు అక్టోబర్ 15 వరకు తమ ప్రతిపాదనలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ స్కీం పైలట్ లాంచ్ డేట్ ను కూడా ఈ నోటిఫికేషన్ లో ప్రస్తావించటం విశేషం. ఇది నవంబర్ 3 న ప్రారంభం అవుతుంది అని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏ పని అయినా కూడా గత కొంత కాలంగా ఒక ప్లాన్ ప్రకారమే చేస్తోంది అని...ఇప్పుడు ఈ రేషన్ షాప్ ల ప్రైవేటీకరణ కూడా ఏదో పెద్ద అజెండాతోనే ముందుకు తెచ్చి ఉంటుంది అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నిర్ణయం కచ్చితంగా రాజకీయంగా దుమారం రేపటం ఖాయం అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Tags:    

Similar News