లిక్క‌ర్ బాండ్స్ తో 8000 కోట్లు..ఇది ఏపీ స‌ర్కారు వారి పాట‌!

Update: 2022-06-11 10:18 GMT

Full Viewతెలుగు రాష్ట్రాల్లో జ‌గ‌న్ స‌ర్కారు ఓ కొత్త ప్ర‌యోగం చేసింది. అప్పుల కోసం నానా తిప్ప‌లు ప‌డుతున్న ప్ర‌భుత్వం కొత్త‌గా లిక్క‌ర్ బాండ్స్ తెచ్చింది. ఈ బాండ్స్ వేలం ద్వారా 2000 కోట్ల రూపాయ‌లు స‌మీక‌రించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంటే ఏకంగా ప‌ది వేల కోట్ల రూపాయ‌లు వ‌చ్చాయి. అయితే అందులో 8000 కోట్ల రూపాయ‌ల‌ను మాత్రం స‌ర్కారు ఉప‌యోగించుకునే యోచ‌న‌లో ఉంది. ఏపీ బ్రీవ‌రేజెస్ కార్పొరేష‌న్ ద్వారా నాన్ క‌న్వ‌ర్ట‌బుల్ డిబెంచ‌ర్స్ (ఎన్ సీడీ) జారీ చేసి ఈ నిధులు స‌మీక‌రించింది. అయితే బాండ్స్ జారీ వ్య‌వ‌హారాన్ని ఏపీ స‌ర్కారు అత్యంత గోప్యంగా న‌డిపించింది.

గ‌త కొంత కాలంగా ఏపీ స‌ర్కారుకు లిక్క‌ర్ ద్వారా భారీ ఎత్తున ఆదాయం వ‌స్తోంది. అంత‌కు ముందు ఏడాది లిక్క‌ర్ ఆదాయం తొమ్మిది వేల కోట్ల రూపాయ‌లు ఉంటే..గ‌త ఆర్ధిక సంవ‌త్స‌రంలో ఏకంగా ఇది 18 వేల కోట్ల రూపాయ‌ల‌కు చేరింది. మ‌ర్చంట్ బ్యాంక‌ర్లు ఈ బాండ్స్ పై మంచి విశ్వాసంతో ఉండ‌టంతో ఇది విజ‌య‌వంతం అయింది. ఎన్ సీడీల పై క‌నీస వ‌డ్డీ 7.5 శాతం ఖ‌రారు చేయగా..గ‌రిష్టంగా ఇది 9.5 శాతానికి చేరింది. మ‌ద్యం ఆదాయానికి సంబంధించి ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేసి..రోజువారీ ప్రాతిప‌దిక‌న మ‌ద్యం ద్వారా వ‌చ్చే డ‌బ్బును ఆ ఖాతాలో జ‌మ చేయ‌నున్నారు.

Tags:    

Similar News