ఏపీ సర్కారు ట్రెజరీ ఉద్యోగులపై కొరడా ఝుళిపించింది. ముందు నుంచి చెబుతున్నట్లుగానే క్రమశిక్షణా చర్యలకు పూనుకుంది. కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాలు జాబితా సిద్ధం చెయ్యని అధికారులకు ప్రభుత్వం మెమోలు జారీ చేసింది. మొత్తంగా 27 మందికి మెమోలు జారీ కాగా.. అందులో ముగ్గురు డీడీలు, 21 మంది సబ్ ట్రెజరీ ఆఫీసర్లు, ఇద్దరు ఏటీఓలు ఉన్నారు. జీతాల బిల్లులు సిద్ధం చేయడంలో అలక్ష్యంగా వ్యవహరించినందుకుగానూ అధికారులు.. ట్రెజరీ ఉద్యోగులకు మెమోలు జారీ చేశారు.
పీఆర్సీ ప్రకటన సమయంలో హర్షం వ్యక్తం చేసిన ఉద్యోగులు జీవోల జారీ తర్వాత పూర్తి రివర్స్ అయ్యారు. తమకు చెప్పింది ఒకటి..చేసింది ఒకటి అంటూ అందరూ ఏకం అయి ఏకంగా సమ్మె నోటీసు కూడా ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే నిబంధనలకు లోబడి పని చేయని వారిపై క్రమశిక్షణా చర్యలు తప్పవని మంత్రులు హెచ్చరిస్తూనే ఉన్నారు. చెప్పినట్లుగానే తొలుత ట్రెజరీ సిబ్బందిపై చర్యలకు ఉపక్రమించారు.