ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ మాత్రమేనా?. కూటమి సర్కారు ప్రజలకు ఏమి సంకేతం ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఉత్తరాంధ్ర నుంచి కేంద్ర క్యాబినెట్ లో ఉన్న మంత్రి కె. రామ్మోహన్ నాయుడు. ఆయన క్యాబినెట్ ర్యాంక్ తో పౌర విమానయాన శాఖ మంత్రి గా ఉన్నారు. అటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తో పాటు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందిన హోమ్ మంత్రి అనితకు ప్రభుత్వం ఇచ్చిన ఫుల్ పేజీ ప్రకటనలో చోటు దక్కలేదు. అంతే కాదు...వైజాగ్ ఇంచార్జి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ది అదే పరిస్థితి. మరో వైపు ప్రధాని మోడీ నిర్వహించే శంకుస్థాపన కార్యక్రమాల్లో ఒక కార్యక్రమం హోమ్ మంత్రిగా ఉన్న వంగలపూడి అనిత నియోజకవర్గంలో ఉంది. అయినా సరే ఆమె ను ప్రభుత్వ ప్రకటనలో విస్మరించారు. మరో వైపు గతంలో ఎన్నడూలేని రీతిలో చంద్రబాబు వైపు నారా లోకేష్, మోడీ వైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోలు పెట్టి ప్రభుత్వం ఫుల్ పేజీ ప్రకటన జారీ చేసింది.
అదేమి విచిత్రమే కాని..గత కొన్ని రోజులుగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జారీ చేస్తున్న ప్రకటనలు ఎవరు ఇస్తున్నారో తెలియకుండా కేవలం ప్రభుత్వ లోగో మాత్రం వాడుతున్నారు. వాస్తవానికి ప్రతి ప్రకటన జారీ సమయంలో అది ఇచ్చింది సమాచార శాఖా లేక పరిశ్రమల శాఖా అన్నది అందులో ఉండాలి. కానీ ఇప్పుడు ఆ నిబంధన కూడా ఎత్తేసినట్లు ఉన్నారు. అసలు ఆ ప్రకటన జారీ చేసింది ఎవరో కూడా తెలియకుండా పేజీలకు పేజీలు యాడ్స్ ఇస్తున్నారు. గత కొంత కాలంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పోలిస్తే నారా లోకేష్ అన్ని విషయాల్లో వెనకబడి పోతున్నాడు అనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది.
అందుకేనా అన్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ వైజాగ్ పర్యటన సందర్బంగా ఉమ్మడి వైజాగ్ నేతలు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును అందరిని పక్కన పెట్టి ప్రధాని మోడీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ధీటుగా ఒక వైపు నారా లోకేష్ ఫోటో కూడా ప్రభుత్వ యాడ్స్ లో జారీ చేశారు. తొలుత కొన్నిసార్లు కూటమి సర్కారు ఇచ్చిన యాడ్స్ లో ఒక్క సీఎం ఫోటో మాత్రమే వేసి...సంబంధిత శాఖ మంత్రి ఫోటో లను కూడా వేయకుండా వదిలేశారు. ఇప్పుడు మాత్రం అటు ప్రధాని మోడీ శంఖుస్థాపన చేసే ప్రాజెక్ట్ లో నారా లోకేష్, పవన్ కళ్యాణ్ శాఖలవి ఏమి లేకపోయినా కూడా వీళ్లకు ప్రభుత్వ యాడ్స్ లో చోటు కలిపించారు. అటు చంద్రబాబు అయినా..ఇటు నారా లోకేష్ అయినా వాళ్లకు తప్ప ఇంకా ఎవరికీ మంచి పేరు వస్తున్నా వాళ్ళను ఎలా తొక్కేయాలా అని చూస్తారు అన్ని..రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ మంత్రిగా మంచి పేరు తెచ్చుకుంటున్నా కూడా ఆయన విషయంలో ప్రభుత్వం ఇలా వ్యవహరించటం సరికాదు అన్న చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది.