చంద్రగిరి వైసీపీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పటికే తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (తుడా) ఛైర్మన్ గా ఉన్నారు. అసెంబ్లీలో విప్ గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తుడా ఛైర్మన్ పదవి ఆయనకు ఇంకా రెండు నెలలు ఉంది. ఎవరికైనా మళ్ళీ పొడిగింపు ఇవ్వాలనుకుంటే ఈ పదవి కాలం ముగిసే వారం ముందో..పది రోజుల ముందో జీవో జారీ చేస్తారు. కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి 2022 జూన్ 12 నుంచి అమల్లోకి వచ్చేలా ఏప్రిల్ 9నే జీవో ఇచ్చారు. ఇందులో మరో రెండేళ్ల పాటు అంటే 2024 జూన్ 12 వరకూ తుడా ఛైర్మన్ గా చెవిరెడ్డి పదవీ కాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ జీవో జారీ ద్వారా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మంత్రివర్గంలో చోటు కల్పించటం సాధ్యంకాదనే సంకేతాలు ఇవ్వటం ఒకెత్తు అయితే..మంత్రి పదవులు రాలేదనే వారిలో ఉండే అసమ్మతి పెరగకుండా ఒక్కోక్కరి అంశాలను ఇలా క్లియర్ చేసుకుంటూ పోతున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి నిర్ణయాలు తుది జాబితా వెలువడే లోగా ఎన్ని వస్తాయో అన్న చర్చ కూడా సాగుతోంది. ఇటీవల వరకూ మంత్రివర్గంలో కొనసాగిన పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డికి మరోసారి కూడా ఛాన్స్ ఉంటుందని పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోంది. చెవిరెడ్డి భాస్కరరెడ్డికి అయితే ముందు జాగ్రత్త చర్యగా రెండు నెలల ముందే పదవి కాలం పొడిగించారు..మరి మరో కీలక నేత ఆర్ కె రోజా పరిస్థితి ఏమిటో ఆదివారం నాడు కానీ తెలిసే పరిస్థితి లేదు.