కీలక పరిణామం. అమరావతి అంశం తాడోపేడో తేలే సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఇప్పుడు ఈ వ్యవహారం దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టుకు చేరింది. అమరావతే రాజధాని అంటూ హైకోర్టు తీర్పు ఇచ్చిన చాలా రోజుల తర్వాత ఏపీ సర్కారు సుప్రీంకోర్టులో అప్పీల్ చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని..మూడు రాజధానులపై ముందుకు సాగకుండా ఇచ్చిన ఆదేశాలను నిలిపివేయాలంటూ పిటీషన్ దాఖలు చేసింది. తొలుత అసెంబ్లీ వేదికగా అమరావతికి మద్దతు ప్రకటించిన జగన్..సీఎం అయిన తర్వాత మాట మార్చారు. మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. దీంతో అప్పటి నుంచి అమరావతి ముందుకు సాగటం లేదు..మూడు రాజధానుల్లోనూ ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. చంద్రబాబు సర్కారు రైతుల దగ్గర నుంచి ల్యాండ్ పూలింగ్ కింద భూమి సేకరించి అమరావతి నిర్మాణం చేపట్టాలని తలపెట్టింది. ఈ మేరకు రైతులతో ఒప్పందాలు చేసుకుంది. వైసీపీ సర్కారు ఈ ఒప్పందానికి భిన్నంగా రాజధానిని మూడు ప్రాంతాలకు మార్చాలని నిర్ణయించటం..దీనిపై రైతులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఒకసారి అసెంబ్లీలో రాజధానిపై నిర్ణయం తీసుకున్న తర్వాత తిరిగి దీనిపై చట్టం చేసే అధికారం శాసనసభకు లేదని హైకోర్టు తేల్చటంతో ప్రభుత్వం ఇరుకున పడింది. ఒక వేళ మార్పులు చేయాలంటే విభజన చట్టంలోనే ఇది చేయాలి కానీ..అసెంబ్లీలో కాదని ప్రకటించటంతో సర్కారు తర్జనభర్జనలు పడుతూ వచ్చింది. తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయిచంటంతో ఇక ఈ అంశంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పును సమర్ధిస్తే మాత్రం రాజధానిగా అమరావతే కొనసాగనుంది. అలా కాకుండా ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రభుత్వం విజయం సాధించినట్లు అవుతుంది. ఏది ఏమైనా కూడా వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరినందున ఏదో ఒక క్లారిటీ అయితే రావటం పక్కా అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రభుత్వం అమరావతి అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన సమయం కూడా ఆసక్తికరంగా మారింది.