జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు టీడీపీ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రస్తుతం ఉన్న హోమ్ మంత్రి అనిత కు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయటం చేతకావటం లేదు అనే అభిప్రాయాన్ని అయన కలిగించారు. ఒక్క హోం మంత్రి మాత్రమే కాదు...పోలీస్ అధికారులు కూడా సరిగా పనిచేయటం లేదు అనే ఫీలింగ్ పవన్ కళ్యాణ్ మాటలు స్పష్టం చేశాయి. అంటే తాను భాగస్వామిగా ఉన్న సర్కారులో హోం మంత్రి , పోలీస్ శాఖ తీరు సరిగా లేదు అని స్పష్టం చేస్తూ ఇలాగే ఉంటే హోం మంత్రిత్వ శాఖ తాను తీసుకోవాల్సి వస్తుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే పవన్ కళ్యాణ్ బహిరంగంగా తన సొంత ప్రభుత్వాన్ని తప్పుపట్టడమే కాకుండా..ఈ ప్రభుత్వంలో తాను ఏది కోరుకుంటే అది తీసుకోగలను అనే అభిప్రాయాన్ని తన మాటల ద్వారా కలిగించారు అనే చర్చ టీడీపీ నేతల్లో సాగుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ తన తాజా వ్యాఖ్యల ద్వారా టీడీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ని బుక్ చేశారు అని ఒక సీనియర్ నేత అభిప్రాయపడ్డారు. ఇంతకాలం సైలెంట్ గా ఉన్న పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా ఇలా బహిరంగంగా మాట్లాడటం దుమారం రేపుతోంది.
నిజంగా ఏదైనా సమస్య ఉంటే చంద్రబాబుతో మాట్లాడాలి..లేదంటే క్యాబినెట్ సమావేశంలో లేవనెత్తాలి కానీ..ఇలా బహిరంగంగా ఒక ఉప ముఖ్యమంత్రి ఇలాగైతే తాను హోం శాఖ తీసుకుంటాను..అది కూడా ఒక వెనకబడిన వర్గాలకు చెందిన మహిళ పై ఇలా నేరుగా ఎటాక్ చేయటం సరికాదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి. ‘నేను హోం మంత్రి అయితే పరిస్థితులు వేరే లా ఉంటాయి. విమర్శలు చేసే వారిని ఇలాగే వదిలేస్తే హోం మంత్రి గా నేను బాద్యతలు తీసుకుంటాను. హోం మంత్రి అనిత రివ్యూ చేయాలి. లా అండ్ ఆర్డర్ చాలా కీలకం..పోలీసులు మరచిపోకండి. మా బంధువు అంటే మడత పెట్టి కొట్టండి. ఆడ పిల్లలు రేప్ చేస్తే కులం ఎందుకు వస్తుంది?. ఇండియన్ పీనల్ కోడ్ పోలీసులు కి ఏమి చెప్తుంది. తెగే వరకు లాగకండి. బయటకు వస్తే ప్రజలు మమ్మల్ని తిడుతున్నారు. డీ జీ పీ బాధ్యతలు తీసుకోవాలి. పదవి ఉండొచ్చు లేకపోవచ్చు ఐ డోంట్ కేర్. గత ప్రభుత్వం లో లా పోలీసులు అలసత్వం గా ఉండకండి.’ అంటూ సంచలన వ్యాఖలు చేశారు. పవన్ కళ్యాణ్ మాటలు చూస్తుంటే అయన ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్లు మాట్లాడుతున్నారు కానీ..అధికారంలోకి ఉన్నామనే విషయాన్నీ మర్చిపోయినట్లు ఉన్నారు అనే ఒక టీడీపీ నేత వ్యాఖ్యానించారు.