పెండింగ్ సినిమాల షూటింగ్ అప్పుడే!

Update: 2024-07-03 16:07 GMT

Full Viewఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో అనిశ్చితి నెలకొంది. ఎన్నికల ముందే ప్రారంభం అయి మధ్యలో ఉన్న సినిమాల పరిస్థితి ఏంటి?. ఇవి పూర్తి అయినా తర్వాత కూడా పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలు చేస్తారా..లేదా అన్న అంశంపై ఆయన ఫ్యాన్స్ లో పలు సందేహాలు ఉన్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ చేతిలో ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరి హర వీరమల్లు సినిమాలు ఉన్నాయి. బుధవారం నాడు పిఠాపురం నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ తన సినిమాల విషయంపై ఒకింత స్పష్టత ఇచ్చారు. ఇప్పటికిప్పుడు సినిమాలు చేయటానికి సమయం ఉండదన్నారు. కొత్త రోడ్లు వేయటం సంగతి అటు ఉంచి..కనీసం రోడ్లపై పడ్డ గుంటలు కూడా పూడ్చకుండా సినిమాలు చేసుకుంటే ఓజీ సంగతి అటుంచి ..క్యాజీ అని ప్రశ్నిస్తారు అంటూ వ్యాఖ్యానించారు. బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న సమయంలోనే ఆయన అభిమానులు ఓజీ ఓజీ అంటూ కేకలు వేశారు.

                                                     ఆ సమయంలోనే సినిమాలపై వివరణ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఓజీ బాగుంటుంది...చూద్దురు గాని అంటూ సినిమాపై అంచనాలు పెంచే పని చేశారు. తొలుత సినిమాలు చేసే టైం ఉంది అంటారా అంటూ...ఎలాగూ మాట ఇచ్చాం కాబట్టి ..నిర్మాతలకు కూడా చెప్పాను కొంచెం క్షమించాలి అని..మా ఆంధ్ర రాజ్య ప్రజలకు కనీసం కొంత సేవ చేసుకుని కుదిరినప్పుడల్లా మీకు రెండు రోజులో ...మూడు రోజులో షూటింగ్ చేస్తాను. ఎక్కడా పనికి అంతరాయం రాకుండా అంటూ వ్యాఖ్యానించారు. దీంతో మూడు నెలల తర్వాత పవన్ కళ్యాణ్ పెండింగ్ సినిమాల షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది అని తేలిపోయింది. మరో వైపు ఈ పెండింగ్ సినిమాలు పూర్తి చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ కొత్త ప్రాజెక్టులకు ఓకే చెపుతారా..లేక పాలనా, పార్టీ వ్యవహారాల్లో బిజీ అవుతారు కాబట్టి కొంత బ్రేక్ తీసుకుంటారా అన్నది తేలాల్సి ఉంది.

                                                                ఇక నుంచి తాను పిఠాపురం నియోజకవర్గంలోనే ఉంటానని పవన్ కళ్యాణ్ తెలిపారు. తాను ఎన్నికల్లో గెలిచినా కూడా హైదరాబాద్ లో ఉంటానని వైసీపీ వాళ్ళు దుష్ప్రచారం చేశారని పవన్ విమర్శలు గుప్పించారు. పిఠాపురంలో తాను ఇప్పటికే మూడు ఎకరాలు కొనుగోలు చేసినట్లు తెలిపారు. తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్ని నెరవేరుస్తాం అని..అయితే తమకు కొంత సమయం ఇవ్వాలన్నారు. పిఠాపురం ప్రజలు ఇచ్చిన గెలుపు దైర్యం గొప్పది అన్నారు. రాష్ట్ర ప్రజలు అంతా కూడా మళ్ళీ కూటమే రావాలి అనేలా తమ పాలనా ఉంటుంది అని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరం అయిన నిధులు కేంద్రం నుంచి తెచ్చే బాధ్యతను తాను, చంద్రబాబు బాధ్యత తీసుకుంటామని వెల్లడించారు. తనను అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వను అని వైసీపీ నేతలు సవాళ్లు చేస్తే పిఠాపురం ప్రజలు ఉప ముఖ్యమంత్రిని చేశారు అని వ్యాఖ్యానించారు. 

Tags:    

Similar News