ఉంటే చంద్రబాబు ...లేకపోతే నేనే అన్న ప్లానా ఇది!

Update: 2024-11-20 13:28 GMT

ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పటికిప్పుడు సీఎం మార్పు ప్రతిపాదన ..అలాంటి ఆలోచనలు కూడా ఎవరికీ...ఏమీ లేవు. కానీ ఎలివేషన్ కోసం మాత్రం టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేష్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ తరహాలోనే లోకేష్ కు కూడా ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనే ఒత్తిడి కుటుంబం నుంచి ఉన్నట్లు టీడీపీ వర్గాల్లో ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ ఐదేళ్లే కాదు...మరో పది సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉండాలని అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ బుధవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు విజన్, పరిపాలనా దక్షత...రాజకీయ అనుభవం అంటూ పవన్ కళ్యాణ్ టీడీపీ నాయకుల కంటే ఎక్కువగా చంద్రబాబు పై పొగడ్తల వర్షం కురిపించారు. అసెంబ్లీలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ సడన్ గా ఈ విషయం లేవనెత్తడం వెనక కారణాలు ఏమై ఉంటాయా అన్న చర్చ సాగుతోంది.

                                                            గతంలో కూడా పవన్ కళ్యాణ్ ఒక సారి పదేళ్లు తాము కలిసే కూటమిగా అధికారంలో ఉంటామని ప్రకటించారు. ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే తమకు చంద్రబాబు అయితే ఓకే కానీ..తాము ఇతరుల నాయకత్వాన్ని ఆమోదించేది లేదు అనే స్పష్టమైన సంకేతాలు పవన్ కళ్యాణ్ పంపుతున్నారు అనే చర్చ తెర మీదకు వస్తోంది. నారా లోకేష్ కు ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి పదవి ఏమీ లేకపోయినా కూడా క్యాబినెట్ సమావేశాలతో పాటు ప్రతి చోటా కూడా అదే ప్రాధాన్యత దక్కుతోంది. మరో వైపు అనధికారికంగా ఒకరిద్దరు మంత్రుల దగ్గర మినహా అన్ని కీలక శాఖల్లో లోకేష్ అనుమతి లేకుండా ఏ పనీ ముందుకు జరిగే పరిస్థితి లేదు అనే చర్చ అటు టీడీపీ వర్గాలతో పాటు అధికార వర్గాల్లో కూడా ఉంది. చంద్రబాబు ప్రస్తుత వయసు 74 సంవత్సరాలు. ఇప్పటికీ ఆయన ఎనర్జీ లెవెల్స్ తో వయసులో ఆయన కంటే చిన్న వాళ్ళు కూడా పోటీ పడలేరు అనే చెప్పొచ్చు. కాకపోతే పాలనతో పాటు పలు విషయాల్లో గతంతో పోలిస్తే చంద్రబాబు స్పీడ్ చాలా వరకు తగ్గింది అనే అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది.

                                                                                    వాస్తవానికి ప్రస్తుతం టీడీపీ కి సొంతంగానే ప్రభుత్వాన్ని నడపటానికి అవసరం అయిన దానికంటే ఎక్కువ మంది సభ్యులే ఉన్నారు. కానీ కూటమిగా కలిసి పోటీ చేసినందున ఈ సిస్టం ను ఇప్పటికిప్పుడు తనకు తానుగా చంద్రబాబు ఎలాంటి మార్పులు చేయటానికి సిద్ధంగా లేరు అనే చెప్పొచ్చు. కానీ లోకేష్ అండ్ టీం మాత్రం ఎంత త్వరగా వీలు అయితే అంత త్వరగా ఎలివేషన్ కోసం ప్రయత్నం చేయాలనే ఆలోచనతో ఉంది. మంత్రి నారా లోకేష్ ఇటీవలి అమెరికా పర్యటన సందర్భంగా కూడా అక్కడి టీడీపీ నాయకులు ఆయన్ను ఫ్యూచర్ సీఎం గా చెపుతూ విమానానికి ఫ్లెక్సీ కట్టి హంగామా చేశారు. ప్రస్తుతానికి చంద్రబాబు కు, పవన్ కళ్యాణ్ కు మధ్య ఎలాంటి గ్యాప్ లు లేకపోయినా...పవన్ కళ్యాణ్..నారా లోకేష్ ల మధ్య అంతా సఖ్యత ఉన్నట్లు కనిపించటం లేదు అనే అభిప్రాయం టీడీపీ నేతల్లోనే ఉంది. ఈ టర్మ్ పూర్తి అయ్యే నాటికే చంద్రబాబు వయసు 78 సంవత్సరాలు అవుతుంది. ఆ తర్వాత కూడా చంద్రబాబు ఇంతే యాక్టీవ్ గా రాజకీయాలు చేయగలరా అన్నది చూడాల్సిందే. ప్రస్తుతానికి పైకి చెప్పకపోయినా సీఎం కావాలనే ఆశ పవన్ కళ్యాణ్ కు ఉన్న విషయం తెలిసిందే. చంద్రబాబు ప్లేస్ లో మరొకరి ఆలోచన వస్తే వెంటనే తానే రంగంలోకి దిగటానికి వీలుగా ఈ స్కెచ్ వేస్తున్నారా అన్న అనుమానాలు కూడా లేకపోలేదు.

Tags:    

Similar News