మళ్ళీ మాట మార్చిన సీఎం జగన్ !

Update: 2023-04-19 07:25 GMT

వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎన్ని సార్లు మాట మారుస్తారు..ఎన్ని సార్లు వైజాగ్ వెళ్లే తేదీ మారుస్తారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రతి సారి మీటింగ్ ల్లో సీఎం జగన్ ఈ మాట చెపుతున్నా ఇది మాత్రం ఆచరణకు నోచుకోవటం లేదు. బుధవారం నాడు శ్రీకాకుళం జిల్లాలో మూలపేట ఓడరేవు పనులకు సీఎం జగన్ శంఖుస్థాపన చేశారు. అక్కడే మరో సారి ఎగ్జిక్యూటివ్ కాపిటల్ అంశాన్ని ప్రస్తావిస్తూ సెప్టెంబర్ నుంచి విశాఖ లో పాలనా సాగిస్తామని ...తాను కూడా ఈ సెప్టెంబర్ నుంచి విశాఖ లో ఉంటానని ప్రకటించారు. ఇదే జగన్ కొద్ది రోజుల క్రితం మంత్రి వర్గ సమావేశంలో జులై నుంచి విశాఖపట్నం వెళుతున్నట్లు మార్చి 15 న జరిగిన మంత్రి వర్గ సమావేశంలో చెప్పినట్లు సాక్షి పత్రిక కూడా రాసింది. మళ్ళీ సీఎం జగన్ ఇప్పుడు వైజాగ్ వెళ్లే తేదీని సెప్టెంబర్ కు మార్చారు. అసలు రాజధాని అంశం ఇప్పుడు సుప్రీం కోర్ట్ లో ఉంది.

                                                           అక్కడ కేసు తేలితే తప్ప జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల విషయంలో ముందడుగు పడదు. ఆ విషయం జగన్ కు కూడా తెలుసు. మరి ఇప్పుడు ప్రతి సారి కొత్త కొత్త తేదీలు ప్రకటించటం..తర్వాత మళ్ళీ వాటిని మార్చి కొత్త తేదీలు ప్రకటించటంతోనే కాలం గడిచిపోతోంది. సీఎం జగన్ ఎక్కడ నుంచి అయినా పాలనా సాగించవచ్చు. కానీ సీఎం జగన్ వైజాగ్ ను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తానని చెప్పి ...ఇప్పుడు తాను అక్కడ నుంచి పరిపాలన చేస్తానంటే సరిపోతుందా అన్న చర్చ కూడా సాగుతోంది. జగన్ చెప్పిన మాట అమలు కావాలి అంటే దీనికి ముందు ఇంకా పూర్తి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని అధికార వర్గాలు చెపుతున్నాయి. ఇప్పుడు అయినా సెప్టెంబర్ ఉంటుందా లేక మరో తేదీ వస్తుందా అన్నది కొద్ది రోజులు పోతే కానీ తెలియదు.

.


Tags:    

Similar News