ఉద్యోగి ఆఫీస్ కు వెళ్లి పనిచేస్తాడు. డాక్టర్ ఆస్పత్రికి వెళ్లి రోగులను చూస్తాడు. లాయర్ కోర్ట్ కి వెళ్లి కేసు లు వాదిస్తాడు. విద్యార్థులు...స్కూల్..కాలేజీలకు వెళ్లి చదువుకోవాలి. ముఖ్యమంత్రి, మంత్రులు సచివాలయానికి వచ్చి విధులు నిర్వర్తించాలి. దేశం లో ఎక్కడైనా జరిగేది ఇదే. ముఖ్యమంత్రితో పాటు ఐఏఎస్ లు..ఇతర సిబ్బంది కోసమే ప్రతి రాష్ట్ర రాజధానిలో సచివాలయం ఉంటుంది. వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాత్రం గత ఐదేళ్లుగా రాష్ట్రానికి పెద్దగా ఐటి కంపెనీలు మాత్రం తీసుకురాలేదు కానీ...ఐటి ఉద్యోగుల మోడల్ ను మాత్రం బాగా వంట బట్టించుకున్నారు. అదే వర్క్ ఫ్రం హోం. గత ఐదేళ్ల కాలంలో జగన్ ఆంధ్ర ప్రదేశ్ సచివాలయానికి వచ్చింది అతి తక్కువ సార్లు అనే చెప్పాలి. అది కూడా కేవలం క్యాబినెట్ సమావేశాల సమయంలోనే అనే చెప్పకతప్పదు. దీంతో జగన్ ఆఫీస్ డుమ్మా సీఎం గా మారిపోయారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో వయసులో జగన్ కంటే ఎంతో పెద్ద వాళ్ళు ఆయినా, రాజకీయాల్లో విశేషానుభవం ఉన్న చంద్ర బాబు, రాజశేఖర్ రెడ్డి తో పాటు రోశయ్య లాంటి వాళ్ళు సచివాలయానికి వచ్చి పరిపాలన సాగించిన వాళ్లే.
ఎప్పుడైనా కూడా ముఖ్యమంత్రి, మంత్రులు సచివాలయానికి వచ్చి తమ తమ శాఖలకు చెందిన అంశాలపై సమీక్షలు చేస్తూ..పరిపాలనకు చెందిన అంశాలపై అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తే పాలన అంతా సాఫీగా సాగటానికి అవకాశం ఉంటుంది. కానీ అదేమీ విచిత్రమో కానీ...జగన్ ఐదేళ్ల పాలన అంతా తాడేపల్లి క్యాంపు ఆఫీస్ లోనే పూర్తి అయింది. అంతే తప్ప అయన సచివాలయానికి వచ్చింది లేదు. యువ సీఎం గా ఉండి పరిపాలనను పరుగులు పెట్టించాల్సింది పోయి...ఎప్పుడో తప్ప అసలు మంత్రులతో పాటు ఐఏఎస్ లకు కూడా కనిపించకుండా పాలన సాగించిన సీఎం గా ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో జగన్ కొత్త రికార్డు క్రియేట్ చేశారనే చెప్పొచ్చు. పరిపాలన విషయంలో సీఎం సీరియస్ గా లేకపోతే ఎలా ఉంటదో చెప్పటానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఏకంగా సిఎంఓ అధికారులకు చెందిన డిజిటల్ సిగ్నేచర్లను దొంగతనం చేసి దుర్వినియోగం చేసిన విషయం తెలిసిందే. దీంతో సిఎంఓ అధికారులు ఎంత ఉదాసీనంగా ఉన్నారో కూడా ఏ ఘటన బయటపెట్టింది. ఇలా బయటకు వచ్చిన అంశాలు కొన్నే. వెలుగులోకి రాకుండా సాగిన పనులు ఎన్నో ఉన్నాయని కొంత మంది అధికారులు చెపుతున్నారు. సీఎం గా ఉన్న ఐదేళ్ల కాలం లో జగన్ ఎప్పుడో బటన్ నొక్కే కార్యక్రమాలకు తప్ప పెద్దగా బయటకు వచ్చిన దాఖలాలు లేవు అనే చెప్పొచ్చు.
ప్రతి రోజు సచివాలయానికి వచ్చి...అధికారులతో..ఇతరులతో మాట్లాడితే తనలోని అసలు విషయం బయట పడుతుంది అనే ఉద్దేశంతోనే అయన క్యాంపు కార్యాలయానికే పరిమితం అయ్యారు అనే అభిప్రాయాన్ని కూడా కొంత అధికారులు వ్యక్తం చేస్తున్నారు. దావోస్ లో జరిగిన మీటింగ్ లో ఒక సారి...తాజాగా వైజాగ్ లో జరిగిన వైసీపీ సోషల్ మీడియా సమావేశం లో ఎదురైన ఒకే ఒక ప్రశ్నకు జవాబు ఇవ్వకుండా జగన్ తప్పించుకున్న విధానం చూసి ఇలాంటి సమస్యలు లేకుండా చూసుకునేందుకు ఆయన వర్క్ ఫ్రం హోం మోడల్ కు పరిమితం అయ్యారు అనే చర్చ సాగుతోంది. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయటం...రోజు కు తాను అనుకున్న ఒకటి రెండు సమీక్షలు తప్ప..పరిపాలనపై జగన్ ముద్ర అనేది ఏమి లేదు అని ఒక ఐఏఎస్ అధికారి అభిప్రాయపడ్డారు. సచివాలయానికి రాకుండా పాలన సాగించే ఉండే విషయంలో జగన్ రాజకీయంగా తనకు ఎంతో సన్నిహితుడు అయిన తెలంగాణ మాజీ సీఎం కెసిఆర్ మోడల్ ఫాలో అయ్యారు అనే చెప్పాలి.