జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రుల మాట ఎమ్మెల్యేలు వింటారా?!

Update: 2025-10-04 11:38 GMT

ఆంధ్ర ప్రదేశ్ లో ఈ సారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లెక్కలు అన్ని మారిపోయినట్లు ఉన్నాయనే చర్చ టీడీపీ నేతల్లోనే సాగుతోంది. గతంలో ఎన్నడూ లేని పరిస్థితి ఈ సారి ప్రభుత్వంలో చూస్తున్నట్లు టీడీపీ నేతలే చెపుతున్నారు. కొంత మంది అయితే ఒక అడుగు ముందుకు వేసి ఈ కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీ లే కాకుండా కొన్ని విషయాల్లో వైసీపీ కూడా భాగస్వామిగా ఉన్నట్లు కనిపిస్తోంది అనే వ్యాఖ్యలు సొంత పార్టీ నేతల దగ్గర నుంచే వినిపిస్తున్నాయి. ఎందుకంటే వైసీపీ హయాంలో వెలుగు వెలిగిన కంపెనీలు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా అదే జోష్ చూపిస్తున్నాయి...వైసీపీ హయాంలో..జగన్ సీఎం గా ఉన్న కాలంలో చక్రం తిప్పిన అధికారులే ఇప్పుడు కూడా అంత కంటే ఎక్కువ స్థాయిలో ప్రభుత్వాన్ని శాసించేలా వ్యవహరిస్తున్నారు అనే చర్చ టీడీపీ నాయకుల్లోనే సాగుతోంది. తొలుత ఈ వ్యవహారాలు అన్ని చూసిన ఎమ్మెల్యేలకు కొన్ని రోజులు ఏమి అర్ధం కాలేదు. అసలు ఏమి జరుగుతుందో అర్ధం అయిన తర్వాత ..పై స్థాయిలోనే ఇంత దారుణమైన సెటిల్మెంట్స్ సాగుతుంటే ఇక తాము చేతులు కట్టుకునే కూర్చోవాల్సిన అవసరం ఏమి ఉంది అన్న చందంగా కొంత మంది ఎమ్మెల్యేలు కూడా రంగంలో దిగినట్లు టీడీపీ నేతలే చెపుతున్నారు.

                                            శుక్రవారం నాడు జరిగిన క్యాబినెట్ సమావేశం అనంతరం చంద్రబాబు మంత్రులతో ఎమ్మెల్యేల గురించిన చేసినట్లు చెపుతున్న వ్యాఖ్యలు ఆయన బలహీనతను సూచిస్తున్నాయని ఒక సీనియర్ మంత్రి అబిప్రాయపడ్డారు. ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత జిల్లా ఇంచార్జి మంత్రులదే అని..అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే తన దగ్గరకు తీసుకురావాలన్నారు. ఎమ్మెల్యేలతో పొలిటికల్ కో ఆర్డినేషన్ పాటు కూటమి పార్టీల మధ్య సయోధ్య చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఇన్ ఛార్జ్ మంత్రులదే అని సీఎం చంద్రబాబు చెప్పినట్లు మీడియాలో ప్రముఖంగా వార్తలు వచ్చాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కొంత మంది ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరు ఏ మాత్రం సరిగాలేదు అని చంద్రబాబు గత కొన్ని రోజులుగా చెపుతున్నారు. ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రులదే అని చంద్రబాబు చెప్పారు అంటే ఆయన ఈ వ్యవహారం నుంచి పక్కకు తప్పుకున్నట్లే కనిపిస్తోంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

                                                     కూటమి ప్రభుత్వానికి ఏకంగా 164 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. నిజంగా చంద్రబాబు కట్టుతప్పిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకున్నా ఏమీ కాదు. కానీ ఆయన ఈ విషయాన్ని పక్కన పెట్టి బాధ్యతల నుంచి తప్పించుకోవటానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు కనిపిస్తోంది అనే వ్యాఖ్యలు టీడీపీ నేతల నుంచి వినిపిస్తున్నాయి. ఏదో కొంత మంది తప్ప జిల్లా ఎమ్మెల్యేలతో సఖ్యతతో ఉండే మంత్రుల సంఖ్య కూడా తక్కువే ఉంటుంది. పైగా ఈ సారి చంద్రబాబు ఎక్కువ మంది కొత్త వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చి సీనియర్లను పక్కన పెట్టారు. పలు జిల్లాల్లో సీనియర్లు కూడా అటు చంద్రబాబు, ఇటు నారా లోకేష్ పై కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అలాంటిది సీనియర్లను అసలు మంత్రులు ఎవరైనా డీల్ చేయగలరా...అసలు అది జరిగే పనేనా అన్న చర్చ కూడా తెర మీదకు వస్తోంది.

Tags:    

Similar News