స్టాలిన్ కు...చంద్ర బాబు కు ఎంత తేడానో!

Update: 2025-01-02 05:58 GMT

రాష్ట్ర ప్రజలపై వచ్చే 25 సంవత్సరాల్లో లక్ష కోట్ల రూపాయల భారం పడినా పర్వాలేదు. ఈ ఒప్పందం వల్ల తన రాజకీయ ప్రత్యర్థికి వేల కోట్ల రూపాయల లాభం వచ్చినా ఓకే. అయినా కూడా నేను జగన్ ను టచ్ చేయటం లేదు అంటే ఎంత మంచివాడినో చూసుకోండి అని చెపుతున్నారు అందరూ ప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే ఒప్పందంపై గోల గోల చేసి...అధికారంలోకి వచ్చాక కొత్త కొత్త లడ్డూ కథలు చెపితే ప్రజలు వాటిని అంత ఈజీగా నమ్మేస్తారా?. చంద్రబాబు నాయుడు మాత్రం అలా నమ్మించే పనిలో ఉన్నారు. కొత్త సంవత్సరం రోజు టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు మీడియా తో చిట్ చేశారు. ఇందులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చూసి టీడీపీ నాయకులు...క్యాడర్ కూడా షాక్ కు గురవుతున్నారు. జగన్ పై చర్యలు తీసుకోవటానికి సెకితో ఒప్పందం లడ్డూ లాంటి అవకాశం. అయినా తాము కక్ష తీర్చుకోవటం కోసం జగన్ అరెస్ట్ వంటి పనులు చేయలేదు.

                                                 జగన్ ను అరెస్ట్ చేయాలనుకుంటే తాము అధికారంలోకి రాగానే చేసేవాళ్ళం. రాజకీయ కక్ష సాధింపు మా పద్ధతి కాదు. వేల కోట్ల రూపాయలు లంచాలు తీసుకుని గత జగన్ మోహన్ రెడ్డి సర్కారు సెకి తో ఒప్పందం చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చినా కూడా మేము చర్యలకు ఉపక్రమించలేదు అంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు. జగన్ మోహన్ రెడ్డి తన ఐదేళ్ల పాలనా కాలంలో పలు జిల్లాల్లో పట్టున్న టీడీపీ నాయకులు చాలా మందిని ఎలా అరెస్ట్ చేయవచ్చో వెతికి వెతికి మరీ వేధింపులకు గురి చేస్తే..చంద్రబాబు మాత్రం తనకు జగన్ లడ్డూ లా దొరికినా అరెస్ట్ చేయలేదు అని చెప్పటం ప్రజలకు ఎలాంటి సంకేతం పంపుతుంది అని ఒక మంత్రి ప్రశ్నించారు. చంద్రబాబు మాటలు చూసిన వాళ్లకు ఎవరికైనా లడ్డూలా దొరికినా వదిలేశారా...లేక ఆ లడ్డూ ను మింగేశారా అన్న అనుమానం రావటం ఖాయం అని ఆ మంత్రి వ్యాఖ్యానించారు.

                                                           సెకి తో కుదిరిన ఒప్పందం రద్దు చేస్తే జరిమానా కట్టాలి అని..ఈ దశలో చర్యలు తీసుకోలేం అని చంద్రబాబు తేల్చిచెప్పారు. స్వయంగా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సెకి తో కుదిరిన ఒప్పందం రద్దు చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వంపై మూడు వేల కోట్ల రూపాయల భారం పడుతుంది అని చెప్పారు. ఈ ఒప్పందం వల్ల ప్రజలపై పడే లక్ష కోట్ల రూపాయల భారం ఎక్కువా...లేక మూడు వేల కోట్ల రూపాయలు ఎక్కువా అన్న విషయం చంద్రబాబుకు తెలియనిదా?. అమెరికా లో అదానీ ముడుపుల కేసు వెలుగులోకి రాక ముందే అంటే టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా సెకి తో కుదిరిన ఒప్పందం దారుణం అని...ఇది ప్రజలపై పెద్ద ఎత్తున భారం మోపుతోంది అని విమర్శలు చేసింది. చంద్రబాబు దగ్గర నుంచి అప్పటి పీఏసీ చైర్మన్, ప్రస్తుత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అయితే దీనిపై గగ్గోలు పెట్టారు. అధికారంలోకి వచ్చాక కూడా చంద్రబాబు ఇదే మాట చెప్పారు.

                                         కానీ ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. దీంతోనే పార్టీ నాయకుల్లో కూడా ఈ వ్యవహారం పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జగన్ కు దొరికినట్లే ..ఇప్పుడు చంద్రబాబు కు కూడా కొత్త లడ్డూలు దొరకటం వల్లే ఈ విషయాన్ని వదిలేసినట్లు కనిపిస్తోంది అనే చర్చ టీడీపీ నేతల్లో కూడా సాగుతోంది. ఒక వైపు ఆంధ్ర ప్రదేశ్ పక్కనే ఉన్న తమిళనాడు లో అక్కడి ముఖ్యమంత్రి ఎం కె స్టాలిన్ తాజాగా అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ కు దక్కిన స్మార్ట్ మీటర్ల ప్రాజెక్ట్ ను రద్దు చేసి ఆదానీకి షాక్ ఇచ్చారు. పోటీ టెండర్ల లో ప్రాజెక్ట్ దక్కించుకున్నా కూడా రేట్లు ఎక్కువ ఉన్నాయనే కారణంతో స్టాలిన్ ఈ నిర్ణయం తీసుకుంటే...చంద్రబాబు నాయుడి మాత్రం ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు లడ్డూ స్టోరీ లు చెపుతున్నారు. 

Tags:    

Similar News