రాష్ట్రంలోని రేషన్ షాప్ లను మినీ మార్ట్స్ గా మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ సివిల్ సప్లైస్ శాఖ వివరణ ఇచ్చింది. డీలర్ల ఆదాయం పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుత ప్రజా పంపీణీ వ్యవస్థ (పీడిఎస్) విధానం అలాగే కొనసాగిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మరిన్ని ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తాజాగా తాము ఆసక్తి వ్యక్తీకరణ నోటిఫికేషన్ (ఈఓఐ) జారీ చేసినట్లు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ లో రేషన్ షాప్ లను కూడా బడా బడా సంస్థలకు అప్పగించబోతున్నట్లు తెలుగు గేట్ వే. కామ్ లో వచ్చిన వార్తకు స్పందిస్తూ ఈ వివరణ ఇచ్చారు. రాబోయే రోజుల్లో కూడా ప్రస్తుతం ఉన్న డీలర్ల ద్వారానే ఇవి కొనసాగుతాయి అని తెలిపారు. ఎఫ్ఎంసిజీ కంపెనీల ద్వారా ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్ల ఆదాయం పెంచే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.
ఇది ఇలా ఉంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఈఓఐ ప్రకారం చూస్తే ఈ ఈఓఐ ద్వారా ప్రభుత్వం ఎంపిక చేసిన ఏ బడా సంస్థ అయినా ఇతర ఉత్పత్తులు అమ్మటానికి గ్రామీణ ప్రాంతల్లో డీలర్ల తో భాగస్వామి కావాలంటే కచ్చితంగా కొన్ని షరతులు పెడుతుంది. ఇక్కడ ఆ కంపెనీల మాటే చెల్లుబాటు అవుతుంది తప్ప...డీలర్ల మాట చెల్లుబాటు అవటం కష్టం. నిజంగా ప్రభుత్వం ఎలాంటి ప్రైవేట్ ప్లేయర్స్ కు మేలు చేయాలని లేకపోతే ...రేషన్ షాప్ లను మినీ మార్ట్ లుగా మార్చాలనుకుంటే రాష్ట్రమంతటికి వర్తించేలా ఒక సింగిల్ డిజైన్ సిద్ధం చేసి....ఒక ప్రభుత్వ రంగ సంస్థ ద్వారానే వీళ్లకు కావాల్సిన వస్తువులు అన్ని సరఫరా చేయవచ్చు అని ఒక అధికారి వెల్లడించారు. ఈఓఐ గడువు ముగిసి ప్రభుత్వం ఎవరిని ఎంపిక చేస్తుందో చూసిన తర్వాత కానీ దీనివెనుక ఉన్న అసలు కథ బయటకు రాదు అని ఆయన వ్యాఖ్యానించారు.