నూతన పర్యాటక విధానానికి ఏపీ మంత్రివర్గం ఆమోదం

Update: 2020-12-18 10:44 GMT

ఏపీ మంత్రివర్గం నూతన పర్యాటక విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని కింద పర్యాటక ప్రాజెక్టులకు ఇఛ్చే భూముల లీజును 33 సంవత్సరాల నుంచి 99 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పర్యాటక ప్రాజెక్టులకు పలు ప్రోత్సాహకాలు ప్రకటించారు. 400 కోట్ల రూపాయలు మించి పెట్టుబడి పెడితే మెగా పరిశ్రమ హోదా ఇస్తామని తెలిపారు. శుక్రవారం నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశాలు పలు నిర్ణయాలు తీసుకుంది. ఆ వివరాలను ఏపీ రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించారు. రైతు భరోసా పథకం, ఇన్‌పుట్‌ సబ్సిడీ నేరుగా ఆర్టీజీఎస్‌ ద్వారా చెల్లింపులు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఇళ్ల పట్టాల పంపిణీ, పక్కా ఇళ్ల నిర్మాణంపై చర్చ జరగడంతో పాటు, ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్ రీసెర్చ్‌ కార్పొరేషన్ ఏర్పాటు ఆర్డినెన్స్‌ కు మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ సర్వే అండ్‌ బౌండరీ చట్ట సవరణ, 6 జిల్లాల్లో వాటర్‌షెడ్ల అభివృద్ధి పథకం అమలుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో కొత్తగా మొత్తం 27 మెడికల్‌ కాలేజీలకు రూ.16వేల కోట్ల నిధులు విడుదల చేయాలని నిర్ణయించారు. కోవిడ్‌ కారణంగా దెబ్బతిన్న పర్యాటక ప్రాజెక్ట్‌లకు రీస్టార్ట్‌ ప్యాకేజీకి ఆమోదం. హోటల్‌ రంగం రీస్టార్ట్‌ కోసం రూ.15 లక్షల వరకు రుణం ఇవ్వటంతోపాటు మొదటి ఏడాదికి 4.5 శాతం రాయితీతో వడ్డీ రుణాలు; సినీ పరిశ్రమకు కూడా రీస్టార్ట్‌ ప్యాకేజీ ఇచ్చేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

Tags:    

Similar News