ఏపీ కేబినెట్ బుధవారం నాడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో ఐటి పరిశ్రమలను ఆకట్టుకునేందుకు వీలుగా ప్రతిపాదించిన నూతన ఇన్ఫర్ మేషన్ టెక్నాలజీ (ఐటి) విధానానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ నూతన విధానం 2024 వరకూ అమల్లో ఉండనుంది.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. జులై 8న వైఎస్‌ఆర్ రైతు దినోత్సవం జరపాలని మంత్రివర్గం నిర్ణయించింది.
దీంతోపాటు 100 ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్‌ల ప్రారంభానికి , 640 కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. 45 కొత్త రైతు బజార్ల ఏర్పాటు, ఆర్‌బీకేల వద్ద గోడౌన్ల నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సమాచార శాఖ మంత్రి పేర్ని నాని కేబినెట్ నిర్ణయాలను మీడియాకు తెలిపారు.
కేబినెట్ నిర్ణయాలు
రూ.89 కోట్లతో మొబైల్ వెటర్నరీ అంబులెన్స్‌ల కొనుగోలుకు ఆమోదం
జులై 1,3,4 తేదీల్లో జగనన్న కాలనీల్లో నిర్మాణాలకు శంకుస్థాపనలు
ప్రతి ఇంటి నిర్మాణానికి రూ.లక్షా 80వేల ఆర్థికసాయం
మౌలిక వసతుల కల్పనకు రూ.34వేల కోట్లు ఖర్చు
ఇళ్లస్థలం పొందిన లబ్ధిదారులు వీలైనంత త్వరగా ఇళ్ల నిర్మాణం చేపట్టాలి.
నగదు వద్దనుకుంటే అమ్మఒడి ద్వారా ల్యాప్‌టాప్ పంపిణీకి ఆమోదం
రూ.339 కోట్లతో ఒంగోలు శివారులో ఆంధ్రకేసరి వర్శిటీ ఏర్పాటుకు ఆమోదం
విజయనగరం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలను వర్శిటీగా మార్పు
వ్యవసాయేతర ఆస్తులకు కూడా పట్టాదారు పాస్‌పుస్తకం ఇవ్వాలని నిర్ణయం
కాకినాడ సెజ్‌లో 2,180 ఎకరాల భూమిని రైతులకు తిరిగి ఇవ్వాలని నిర్ణయం