కొత్త జిల్లాల ఏర్పాటుకు ఏపీ మంత్రివ‌ర్గ ఆమోదం!

Update: 2022-01-25 16:18 GMT

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్ర‌క్రియ కీల‌క ద‌శ‌కు చేరింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 13 జిల్లాలు ఉండ‌గా..కొత్త‌గా మ‌రో 13 జిల్లాలు జ‌త చేర‌నున్నాయి. తొలుత ఒక్కో పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాన్ని జిల్లాగా మార్చాల‌ని ప్ర‌తిపాదించారు. వాస్తవానికి ఏపీలో 25 లోక్ స‌భ స్థానాలు ఉన్నాయి. కానీ జిల్లాల ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేస‌రికి మాత్రం 26 అవుతున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుకు మంగ‌ళ‌వారం నాడు ఏపీ మంత్రివ‌ర్గం ఆమోదం తీసుకున్నారు. ఆన్ లైన్ ప‌ద్ద‌తిలో మంత్రుల అనుమ‌తితో ఈ కార్య‌క్ర‌మం ముగించారు. ఉగాది నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు ప్ర‌క్రియ‌ను ఓ కొలిక్కి తేవాల‌ని స‌ర్కారు పట్టుద‌ల‌గా ఉంది. కొత్త‌గా ఏర్పాటు చేయ‌నున్న వాటితో క‌లుపుకుని మొత్తం 26 జిల్లాల ప్రతిపాదనల నివేదికను ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్ తాజాగా సీఎస్‌కు అంద‌జేశారు.

ఇదే అంశంపై ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌మీర్ శ‌ర్మ మంగ‌ళ‌వారం నాడు జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించి ఇదే అంశంపై చ‌ర్చించారు. కొత్త జిల్లాల ఏర్పాటు సంద‌ర్భంగా తీసుకోవాల్సిన చర్య‌లు..జిల్లాల నుంచి పంపాల్సిన స‌మాచారం త‌దిత‌ర అంశాల‌పై మాట్లాడారు. పరిపాలనా సౌలభ్యం కోసం, ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటుచేస్తామని జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పొందుపరిచారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై సుదీర్ఘ కసరత్తు జరిపారు. అర‌కు పార్లమెంట్‌ సెగ్మెంట్‌ భౌగోళికంగా చాలా విస్తార‌మైనది కావ‌డంతో.. ఆ నియోజ‌క‌వ‌ర్గాన్ని రెండు జిల్లాలుగా చేసే అవకాశం ఉందని స‌మాచారం.

Tags:    

Similar News