ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ భేటీ హాట్ హాట్ గా సాగే అవకాశం కన్పిస్తోంది. ముఖ్యంగా ఏపీలో పెట్రోలో, డీజిల్ లపై వ్యాట్ తగ్గింపు, ఆర్ధిక సంక్షోభం, వివేకా హత్య కేసు, ఎయిడెడ్ విద్యా సంస్థలపై సర్కారు వైఖరి, ఏపీలోని రహదారులు వంటి కీలక అంశాలు ఈ సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. వాస్తవానికి ఈ సమావేశాలు ఒక్క రోజు మాత్రమే ఉంటాయని ప్రచారం జరిగింది. అయితే స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, అనిల్ కుమార్ యాదవ్, కురసాల కన్నబాబు హాజరయ్యారు.
టీడీపీ నుంచి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు హాజరయ్యారు. నవంబర్ 26 వరకు అసెంబ్లీ సమావేశాలను కొనసాగించాలని టీడీపీ కోరగా.. టీడీపీ డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించింది. దీంతో ఈ నెల 26 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు సాగనున్నాయి.. అసెంబ్లీ సమావేశాల ప్రారంభాన్ని పురస్కరించుకుని చంద్రబాబు పాదయాత్రతో వచ్చారు. నిత్యావసర ధరల పెరుగుదల నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు. చెత్తపై వేసిన పన్ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ పాలనలో సామాన్యులు చితికిపోతున్నారని చంద్రబాబు విమర్శించారు.