ఎవరికి ఎన్ని వస్తాయో!

Update: 2025-09-26 08:27 GMT

ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలన్న నిర్ణయం ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పుడు పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. మొత్తం పది కాలేజీలను ఈ విధానంలో ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. తొలి దశలో నాలుగు కాలేజీలు ఇవ్వటానికి ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ సర్వీసెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎంఎస్ఐడీసి) ఇటీవలే టెండర్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ ( డీబీఎఫ్ ఓటి) విధానంలో వీటిని అప్పగించనున్నారు. తొలి దశలో ఉన్న వాటిలో ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల కాలేజీలు ఉన్నాయి. ఈ కాలేజీల్లో 625 బెడ్స్ తో కూడిన హాస్పిటల్ కూడా నిర్మించాలని ప్రతిపాదించారు. మొత్తం పది కాలేజీలను రెండు దశల్లో పీపీపీ విధానంలో కట్టబెట్టాలని నిర్ణయించారు. రెండవ దశలో పెనుకొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం కాలేజీ లు కేటాయించనున్నారు. తొలి దశలో కేటాయించే కాలేజీలను 33 సంత్సరాలు లీజ్ కు ఇవ్వనున్నట్లు చెపుతున్నారు. అయితే అత్యంత విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం ఈ హాస్పిటల్స్ ను దక్కించుకునే రేస్ లో మణిపాల్ హాస్పిటల్స్ ఉన్నట్లు అధికార వర్గాలు చెపుతున్నాయి.

                                                                     ఇప్పుడు ఈ హాస్పిటల్స్ లో మెజారిటీ వాటా సింగపూర్ ప్రభుత్వానికి చెందిన టెమాసెక్ హోల్డింగ్స్ కు ఉంది. ఒక దశలో ఈ వాటా 59 శాతానికి చేరినా మధ్యలో కొంత వాటాను టెమాసెక్ హోల్డింగ్స్ ఇతరులకు విక్రయించింది అని వార్తలు వచ్చాయి. ఇప్పటికీ మణిపాల్ హాస్పిటల్స్ అతి పెద్ద వాటా దారు మాత్రం టెమాసెక్ హోల్డింగ్స్ కంపెనీ నే. సింగపూర్ సంస్థలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి మంచి సత్సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఆంధ్ర ప్రదేశ్ లోని మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్ నిర్మాణం బాధ్యతలను పీపీపీ విధానంలో అప్పగించాలని నిర్ణయించిన తర్వాత ఈ కంపెనీ రేస్ లోకి వస్తున్నట్లు అధికార వర్గాలు చెపుతున్నాయి. అయితే పీపీపీ విధానంలో అప్పగించనున్న పది కాలేజీల్లో ఎన్ని ఈ సంస్థకు వెళతాయి అన్నది ఇప్పుడు కీలకంగా మారబోతుంది అని చెపుతున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఏమి చేసినా కూడా అంతా ముందే సెట్ చేసుకుని ఒక ప్లాన్ ప్రకారమే ప్రతి విషయంలో ముందుకు వెళుతుంది అని..ఇప్పుడు మెడికల్ కాలేజీల విషయంలో కూడా అదే జరగుతోంది అని అధికారులు చెపుతున్నారు. మణిపాల్ హాస్పిటల్స్ తో పాటు ఇతర సంస్థలు ఏవి రంగంలో ఉంటాయో వేచిచూడాల్సిందే. అధికారులు చెపుతున్నట్లు సింగపూర్ కంపెనీకి ప్రధాన వాటా ఉన్న మణిపాల్ హాస్పిటల్స్ కు ఎక్కువ కాలేజీ లు వెళితే అప్పుడు అసలు విషయం బయటపడుతుంది అని ఒక అధికారి వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News