సుప్రీంలో అమరావతి కేసులు ఏప్రిల్ కు వాయిదా(Amaravati cases in Supreme court)

Update: 2024-01-03 10:08 GMT

ఆంధ్ర ప్రదేశ్ రాజధానికి న్యాయ పరిష్కారం కంటే రాజకీయ పరిష్కారం మార్గం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సుప్రీం కోర్టు అమరావతికి సంబదించిన కేసు లను ఏప్రిల్ కు వాయిదా వేసింది. దీంతో ఇప్పటిలో ఈ వ్యవహారం తేలటం కష్టం అనే స్పష్టం అయిపొయింది. వచ్చే ఏప్రిల్ లోనే లోక్ సభ తో పాటు ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ కి కూడా ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో తెలుగు దేశం, జనసేన కూటమి అధికారంలోకి వస్తే రాజధానిగా అమరావతి ఉంటుంది...మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తే ఇక అమరావతి సంగతి మర్చిపోవటమే. తొలుత అమరావతికి మద్దతు ఇచ్చిన జగన్ తర్వాత మూడు రాజధానుల నినాదం అందుకోవటంతో మొత్తం వ్యవహారం కోర్టు కు చేరింది. ఏపీ హై కోర్టు ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతే అంటూ తీర్పు ఇచ్చింది. దీనిపై జగన్ సర్కారు సుప్రీం కోర్టు ను ఆశ్రయించింది. ఈ కేసు ను సాద్యమైనంత త్వరగా విచారణకు వచ్చేలా చూసేందుకు జగన్ సర్కారు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. బుధవారం నాడు అమరావతి కేసు విచారణ రాగా.. ఈ కేసు లో ఇంకా లిఖితపూర్వక అఫిడవిట్లు దాఖలు పూర్తి కాలేదు అని..రైతుల తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకు వెళ్లగా...నాలుగు వారాల్లో అఫిడవిట్లు, కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ కేసు ను ఏప్రిల్ కు వాయిదా వేసింది. ఏప్రిల్‌లో సుదీర్ఘంగా వాదనలు విన్న తర్వాతే నిర్ణయం తీసుకుంటామని సుప్రీం ధర్మాసనం తెలిపింది.

                                    మూడు రాజధానుల చట్టాలను ఉపసంహరించుకున్నా.. హైకోర్టు తీర్పు ఇవ్వడం సమంజసం కాదని ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదించారు. ఈ కేసులో ఇంకా లిఖితపూర్వక అఫిడవిట్‌లు దాఖలు చేయడం పూర్తి కాలేదని రైతుల తరపున న్యాయవాది దేవదత్ కామత్ వాదనలు వినిపించారు. సహజంగానే వచ్చే ఎన్నికల్లో రాజధాని ఒక కీలక ప్రచార అస్త్రంగా ఉండబోతుంది. ఈ విషయంలో అధికార వైసీపీ, సీఎం జగన్ ఒకింత ఇరకాటంలో పడటం ఖాయం. ఎందుకంటే అమరావతి లో చంద్రబాబుకు ఇళ్ళు లేదు..తాను ఇక్కడే ఇళ్ళు కట్టుకున్నా అని చెప్పిన విషయం తెలిసిందే. జగన్ సీఎం అయితే రాజధాని ని మారుస్తారని టీడీపీ దుష్ప్రచారం చేస్తుంది అంటూ అప్పటిలో వైసీపీ నేతలు పెద్ద ఎత్తున కౌంటర్ ఇచ్చుకుంటూ వచ్చారు. కానీ జగన్ సీఎం అయిన తర్వాత మూడు రాజధానులు అంశాన్ని తెరపైకి తేవటంతో ఈ మొత్తం వ్యవహారం తీవ్ర గందరగోళంలో పడిపోయిన విషయం తెలిసిందే. మరి వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి. ముఖ్యంగా వైసీపీ రాజధాని కారణంగా గుంటూరు, కృష్ణా తో పాటు మరి కొన్ని ప్రాంతాల్లో కూడా దెబ్బతినే అవకాశం ఉంది అనే అంచనాలు ఉన్నాయి. 

Tags:    

Similar News