అల్లు అర్జున్ పొలిటికల్ డబల్ యాక్షన్!

Update: 2024-05-11 09:08 GMT

సినిమా హీరో లు రాజకీయ నాయకుల కంటే ఎక్కువ రాజకీయం చేస్తున్నారా?. ఒక వైపు మాత్రమే మద్దతు ఇస్తే భవిష్యత్ లో తమ సినిమాలకు ఇబ్బంది వస్తుంది అని భయపడుతున్నారా?. టాలీవుడ్ లో టాప్ హీరోల్లో ఒకరైన అల్లు అర్జున్ తీరు చూసిన తర్వాత ఎవరికైనా ఇదే అనుమానం రాక మానదు. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో అధికార వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుంటే...మరో వైపు టీడీపీ, జన సేన, బీజేపీ లు కూటమిగా బరిలో నిలిచిన విషయం తెలిసిందే. జన సేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ కోసం చిరంజీవి ఒక వీడియో విడుదల చేసి మద్దతు తెలపగా...రామ్ చరణ్ కూడా తొలుత ట్వీట్ ద్వారా మద్దతు ప్రకటించారు. ఇటీవలే అల్లు అర్జున్ కూడా పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రయాణం విజయవంతంగా సాగాలని...తన ప్రేమ, మద్దతు ఎప్పటికి పవన్ కె ఉంటాయని అందులో పేర్కొన్నారు. పవన్ లక్ష్యాలు నెరవేరాలని కోరుకుంటున్నట్లు అల్లు అర్జున్ తన ట్వీట్ లో రాసుకొచ్చారు. నిన్నటి వరకు ఇది అంతా బాగానే ఉన్నట్లు కనిపించింది. కానీ శనివారం నాడు అల్లు అర్జున్ అధికార వైసీపీ నంద్యాల అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డికి మద్దతు గా నిలబడేందుకు భార్య స్నేహ రెడ్డి తో కలిసి నంద్యాల వెళ్లారు.

                                                             శిల్పా రవిచంద్ర రెడ్డి నివాసం వద్దకు పెద్ద ఎత్తున వచ్చిన అభిమానులకు అభివాదం చేసిన అల్లు అర్జున్ అయన ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుకున్నారు. రవిచంద్ర రెడ్డి భార్య, అల్లు అర్జున్ భార్యలు క్లాస్ మేట్స్, స్నేహితులు కూడా. దీంతో వీళ్ళద్దిరి మధ్య అంటే అల్లు అర్జున్, రవి చంద్ర రెడ్డి మధ్య కూడా స్నేహం పెరిగింది. అందులో భాగంగానే స్నేహితుడికి అండగా నిలబడటానికి అల్లు అర్జున్ నంద్యాల వెళ్లారు. స్నేహితుడి కోసం అండగా ఉండటాన్ని ఎవరూ తప్పుపట్టారు. కానీ కుటుంబ సభ్యుడు అయిన పవన్ కళ్యాణ్ విషయం లో మాత్రం ఒక ట్వీట్ తో సరిపెట్టి, వైసీపీ అభ్యర్థి కోసం ఏకంగా నంద్యాల వరకు వెళ్ళటం ఇప్పుడు అటు రాజకీయ వర్గాలతో పాటు సినీ వర్గాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. మరో వైపు నేరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనకపోయినా శనివారం నాడే రామ్ చరణ్ పిఠాపురం వెళ్లారు. ఆయనతో పాటు రామ్ చరణ్ తల్లి సురేఖ, అల్లు అరవింద్ కూడా ఉన్నారు. మొత్తానికి ఈ సినిమా హీరో ల రాజకీయం వెరైటీగా ఉంది అనే చెప్పాలి.

Tags:    

Similar News